ఇప్పుడంతా క‌రోనా ముప్పే. చిత్రం ఏంటంటే...లాక్‌డౌన్‌ సమయంలో వైరస్‌పై అవగాహన పెంచుకొని.. తద్వారా జాగ్రత్తలతో కరోనా ఉనికిని ప్రశ్నార్థకం చేయాలనేది ఉద్దేశం. కానీ లాక్‌డౌన్‌ సడలించింది మొదలు.. జనం రోడ్లు ఎక్కుతున్నారు. మాకేం అవుతుందిలే అన్న ధోరణితో వ్యవహరించడంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డూ అదుపు లేకుండా పోయింది. ముఖ్యంగా గత రెండు వారాల్లోనే హైదరాబాద్‌ నగరంలో కేసుల సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగించే అంశం. అయితే స్వీయ నియంత్రణే.. కరోనా వ్యాప్తి నిరోధానికి సరైన మందు. మనం తీసుకునే జాగ్రత్తలే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

 

 

క‌రోనా వైర‌స్ విష‌యంలో భౌతిక దూరం కీల‌క‌మైన‌ది. బజారుకు వెళ్లినా, కార్యాలయాలకు పోయినా, ఎక్కడ తిరిగినా భౌతిక దూరం పాటించడమంటేనే వైరస్‌కు దూరంగా ఉండటం. క‌నీసం ఒక మీటరు మేర భౌతిక దూరాన్ని పాటించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇద్దరు వ్యక్తులు భౌతికంగా దగ్గర కాకుండా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడం ఉత్త‌మ‌మైన మార్గ‌మ‌ని నిపుణులు చెప్తున్నారు. ఇలా భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ ఫోన్‌, వీడియో కాల్స్‌, ఛాటింగ్‌ ద్వారా సామాజికంగా అనుసంధానం సాధ్యం అవుతుంది కాబ‌ట్టి నేరుగా క‌లిసే మాట్లాడాలి అనే భావ‌న దూరం పెట్టాల‌ని సూచిస్తున్నారు. 

 

 

ఇక ఇత‌రుల నుంచి త‌మ‌ను తాము ర‌క్షించుకోవ‌డంలో సైతం త‌‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా వైర‌స్‌ వ్యాప్తి చెందుతుంది. అంతేకాక పాజిటివ్‌ వ్యక్తి తాకిన ప్రదేశాల్లో వైరస్‌ ఉంటుంది. ఆ ప్రదేశాన్ని ఎవరైనా ముట్టుకుని అదే చేతులతో తన ముక్కు, నోటిని తాకినప్పుడు వైరస్‌ శరీరంలోకి వెళ్తుంది. మామూలు సమయాలతో పాటు, చుట్టుపక్కల ప్రదేశాలను ముట్టుకున్నా  చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. తరచూ నోరు, ముక్కు, కళ్లను చేతితో తాకకూడదని అంటున్నారు. ఈ రెండు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం వ‌ల్ల క‌రోనా విస్తృతిని త‌గ్గించ‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: