అనాగరికం..అమానుషం...సరిహద్దు నిబంధనలకు తూట్లు పొడిచిన పచ్చి నిజం. గల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణలో బయటపట్ట  చైనా సైనికుల దాష్టీకాలు చూసి ప్రపంచమే నివ్వెరపోతోంది.  పక్కా ప్లాన్ తో నేరపూరితంగా డ్రాగన్ జవాన్లు వ్యవహరించిన తీరును భారత జవాన్  కళ్లకు కట్టినట్టు  వివరించడంతో.. అక్కడ ఎంతటి భయానక పరిస్ధితులను మన సైన్యం ఎదుర్కొందో అర్దమవుతుంది.

 

ఇండియా-చైనా సరిహద్దు ప్రాంతం గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో..  20మంది భారత సైనికులు అమరులైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రతీ భారతీయుడు చైనా తీరుపై ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే ఈ దాడి సమయంలో అసలేం జరిగింది ? ఇనుప చువ్వలతో మన జవాన్లపై చైనా సైనికులు దాడి చేశారా ?  కేవలం ఒక్క మనిషే నిల్చునేంత చిన్న స్థలంలో చైనాతో మన సైనికులు పోరాడారా? అంటే మన జవాన్ చెప్పిన సంచలన విషయాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. డ్రాగన్ ఆర్మీ తీరు ఎంత హేయంగా ఉందో అర్ధమవుతుంది.

 

 దాడి సమయంలో ఇరువైపుల సైన్యం ఎటువంటి తుపాకులు ఉపయోగించనప్పటికీ, చైనా సైనికులు ఇనుప చువ్వలు బిగించిన ఇనుప రాడ్లతో దాడిచేసినట్లు తేలింది. పొడవాటి ఇనుప కడ్డీలకు చివరన ఇనుప చువ్వలను వెల్డింగ్‌ చేసి ఉన్న ఫోటోలను తాజాగా ప్రముఖ రక్షణ రంగ నిపుణులు అజయ్‌ శుక్లా సామాజిక మాద్యమంలో పోస్టు చేశారు. గల్వాన్‌ ఘర్షణ జరిగిన ప్రాంతంలో భారత సైనికులు ఈ ఫోటోలు తీసినట్లు తెలిపారు.   ఇది సైనికచర్య కాదని నేరపూరిత చర్యగా అభివర్ణించారు. ఆ దృశ్యాలు చూస్తుంటే చైనా పక్కా ప్రణాళికతోనే భారత సైన్యంపై ఈ దాడికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

 

ఇరుకైన ప్రాంతంలో.., ఎముకలు గడ్డకట్టేంత చిన్న కాలువలో చైనా జవాన్లకు మన భారత జవాన్లు ధీటైన సమాధానం చెప్పారు.  అసలు గాల్వాన్‌లో ఏం జరిగిందో అందులో పాల్గొన్న సురేంద్ర సింగ్ అనే జవాన్  వివరించారు.  చైనా సైనికులు మనకు ధోకా ఇచ్చారని.,  ఉన్నట్లుండి హఠాత్తుగా  తమపై దాడికి దిగారని వివరించారు.  4 నుంచి 5 గంటల వరకూ నదిలోనే వారితో ఘర్షణ జరిగిందని.,  మన సైనికులు 200 నుంచి 250 మంది ఉంటే... చైనా వాళ్లు  వెయ్యి కంటే ఎక్కువ మందే ఉన్నారని తెలిపాడు. ఈ ఘర్షణ మొత్తం కూడా ఎముకలు గడ్డ కట్టిపోయే, గొంతు కోసే చల్లని నీటిలోనే సాగిందని వివరించాడు జవాన్ సురేంద్ర సింగ్.  నది ఒడ్డున కేవలం ఒక్క మనిషి మాత్రమే నిలబడేంత చోటు మాత్రమే ఉందని.,  అంత చిన్న స్థలంలోనే వారితో పోరాడినట్టు తెలిపాడు.  అందుకే పో్రాటంలో చాలా ఇబ్బందులు పడ్డామని.. లేకపోతే భారత సైనికులు ఎందులో తక్కువ? మనం చైనా వాళ్లకు సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగానే ఉన్నామని చెప్పాడు. అయితే తమపై కుట్రతో, మోసపూరితంగా దాడికి దిగారని  గాల్వాన్‌లో జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు సురేంద్ర సింగ్ వివరించాడు.

 

సురేంద్ర సింగ్.... గాల్వాన్‌లో భారత్ - చైనాకు మధ్య జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తీవ్రంగా గాయపడ్డారు. తలలో డజనుకు పైగా కుట్లు వేశారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన ప్రకటించారు.  లడఖ్‌లోని సైనిక ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: