దేశంలోని ప‌రిస్థితులు, స‌రిహ‌ద్దుల్లోని స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్య‌లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భారతదేశంలో పరిపాలన సుస్థిరంగా ఉండడంతో పాటు, గొప్ప ఆర్థిక శక్తిగా ఎదగడం ఓర్వలేకనే చైనా కయ్యానికి కాలు దువ్వుతోందని కేసీఆర్ విశ్లేషించారు. తద్వారా ప్ర‌ధాని మోదీకి కితాబు ఇచ్చారు.

 


భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణలు తలెత్తిన నేపథ్యంలో ఏమాత్రం తొందరపాటు ఉండొద్దని సీఎం కేసీఆర్ అన్నారు. అదే సందర్భంలో దేశ ప్రయోజనాల విషయంలో తలవంచాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. చైనాను ఎదుర్కొనేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలు అవలంబించాలని ప్రధానమంత్రికి సూచించారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి తాము పూర్తి అండగా నిలుస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశంలో ఇప్పుడు కావాల్సింది రాజకీయం (రాజ్ నీతి) కాదని, యుద్ధనీతి (రణ్ నీతి) కావాలని చెప్పారు. `చైనా, పాకిస్తాన్ దేశాలకు తమ దేశాల్లో అంతర్గత సమస్యలున్నప్పుడు సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడం అలవాటు. ఇప్పుడు చైనాలో కూడా అంతర్గత సమస్యలున్నాయి. దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ తదితర దేశాలతో కూడా చైనా ఘర్షణలకు దిగుతోంది. చైనా వైఖరి ప్రపంచవ్యాప్తంగా బాగా అపఖ్యాతి పాలయింది` అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

 


భారతదేశంతో చైనా మొదటి నుంచి ఘర్షణ వైఖరి అవలంభిస్తోంద‌ని కేసీఆర్ అన్నారు. ``గాల్వన్ లోయ లాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయి. ఇది మొదటిది కాదు, చివరిది కాదు. 1957లో సరిహద్దు వివాదం లేవనెత్తింది. 1962లో ఏకంగా భారత్ – చైనా మధ్య పూర్తిస్థాయి యుద్ధమే జరిగింది. 1967లో కూడా సరిహద్దులో ఘర్షణ జరిగింది. అప్పుడు 200 మంది మృతి చెందారు. ఇప్పుడు గాల్వన్ వద్ద మళ్లీ ఘర్షణలు జరిగాయి. అందులోనూ మన సైనికులు 20 మంది మరణించారు. వేల కిలోమీటర్ల సరిహద్దు కలిగిన దేశంతో ఎక్కడో ఓ చోట  ఏదో ఓ గొడవ జరుగుతూనే ఉంది. చైనాతో భారతదేశానికి ఎప్పటికైనా ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి ఉంది` అని సీఎం కేసీఆర్ సూచించారు. దేశమంతా కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రికి అండగా నిలవాల‌ని కోరిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు ఈ సమయంలో దేశ ప్రధానికి అండగా ఉంటారని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: