ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ పిల్లల ఆశ్రమంలో కరోనా కలకలం రేపింది. ఏకంగా 57 మంది బాలిక‌ల‌కు కరోనా సోకడ‌మే కాకుండా ఇందులోని ఐదుగురు గ‌ర్భం దాల్చిన‌ట్లు వైద్య ప‌రీక్ష‌ల్లో నిర్ధార‌ణ అయింది. అంతేకాకుండా ఒక‌రికి హెచ ఐవీ సోకిన‌ట్లు కూడా తేలింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.  వైరస్ సోకని మిగతా బాలికలు, సిబ్బందిని క్వారంటైన్‌లో ఉంచి, ఆ భవనాన్ని సీల్ చేశారు. అయితే, ఈ వసతిగృహంలోని కనీసం ఇద్దరు బాలికలు గర్బందాల్చినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని స్థానిక మీడియాలో ఆదివారం విస్తృత ప్రచారం సాగడంతో బాలికల భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ విష‌యంపై మీడియాలో విస్తృతంగా క‌థ‌నాలు ప్ర‌సారం కావ‌డంతో ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకుంది. ఇదిలా ఉంటే బాలికల ఆశ్రమంలో గర్భిణిలు ఉండటంపై స్థానికంగా పలు వార్తలు రాగా.. దినేష్ కుమార్ వాటిని ఖండించారు. ఆశ్రమంలోకి రాకముందే వారు గర్భం దాల్చారని, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా జరుగుతోందని కాన్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్ దినేష్ కుమార్ వెల్లడించారు. ఇదిలా ఉండ‌గా క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంపై   అధికారులు స్ప‌ష్ట‌త ఇచ్చారు.  ఆశ్రమంలో ఏడుగురు గర్భిణి మహిళలు ఉన్నార‌ని,  అందులో ఐదుగురికి కరోనా సోకింద‌ని తెలిపారు. కరోనా సోకిన అందరికీ కాన్పూర్ మెడికల్ కాలేజీలో చికిత్స జరుగుతున్నట్లు వెల్లడించారు. ఆశ్రమంలో కరోనా వైరస్ ఎలా వ్యాప్తి చెందిందన్న దానిపై దర్యాప్తు చేస్తామని ఆయన వెల్లడించారు. 

 


ఆశ్రమంలోని సిబ్బంది ఇటీవల ఇద్దరు బాలికలతో కలిసి కాన్పూర్ హాస్పిటల్‌కు వెళ్లారని, అక్కడ కోవిడ్-19 రోగులతో కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి వైరస్ సోకిందని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండ‌గా కాన్పూర్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 400 దాటగా.. రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉంది. ఉత్తప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసులు 17వేలు మార్క్ దాటింది. అయితే, వీరిలో 11వేల మంది కోలుకోగా.. ప్రస్తుతం 6వేలు యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. ఇదివరకు ఉన్న గ్రీన్ జోన్లలో సైతం లాక్‌డౌన్ సడలింపుల తరువాత కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: