చైనా సైన్యం దురాక్ర‌మ‌ణ, వెన్నుపోటు దాడిలో నేల‌కొరిగిన భ‌ర‌త‌మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు మ‌ర‌ణంపై ర‌క్ష‌ణ అధికారులు మ‌రింత వివ‌ర‌ణ ఇచ్చారు. అతని పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమంటూ, ఆసలు ఈ నెల 15న చైనా బలగాలతో జరిగిన ఘర్షణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికార వర్గాలు వెల్లడించాయి. తమ కంటే ఎక్కువ సంఖ్యలో చైనీయులు విరుచుకుపడుతున్నా భారత సైన్యం వెనక్కు తగ్గకపోగా చైనీయుల చేతుల్లోని ఇనుప రాడ్లు, మేకులతో కూడిన గదల్లాంటి ఆయుధాలను లాక్కుని ప్రతిదాడికి దిగారని, ఈ క్రమంలో పెట్రోల్‌ పాయింట్‌ 14 వద్ద కనీసం 40 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది.


 చైనా సైనికుల ఘ‌ర్ష‌ణ‌పై భార‌త ప్ర‌భుత్వం ఏదో దాస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ర‌క్ష‌ణ శాఖ అధికారులు పూర్తి స్ప‌ష్ట‌త ఇస్తూ వివ‌రాలు వెల్ల‌డించారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... సంతోష్ నాయకత్వంలోని భారత బలగాలు చైనా సైనిక మూక‌ల‌తో వీరోచిత పోరాటం జరిపాయి. భార‌త భూభాగంలో చైనా సైనికులు గుడారాల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలుసుకుని ఈనెల 15 చైనా శిబిరాల వద్దకు సంతోష్‌బాబు తన టీమ్‌తో స‌హా వెళ్లాడు.  అక్క‌డ మాట్లాడుతుండ‌గానే చైనా సైనిక బృందంలోని ఒక‌రు సంతోష్ పై చెయ్యి చేసుకున్నాడు. దీంతో, భారత జవాన్లలో ఆగ్రహం పెరిగి, చైనా సైనికులతో బాహాబాహీకి దిగారు. దాదాపు అరగంట పాటు పోరు సాగగా, భారత బలగాలదే పైచేయి అయింది. ఈ పోరులో పలువురు గాయపడ్డారు కూడా. ఆ తరువాత చైనా సైనికులు వెళ్లిపోగా, వారి గుడారాలను నేలకూల్చిన సంతోష్ టీమ్, వాటిని కాల్చి బూడిద చేసింది. 

 

అప్పటికే సంతోష్ బాబుకు గాయాలు అయ్యాయి. అయినా చికిత్స నిమిత్తం వెళ్లేందుకు నిరాకరించిన ఆయన, తన బృందంతో అక్కడే ఉండిపోయారు. ఇతర గాయపడిన వారిని వెనక్కు పంపారు.  ఆపై కాసేపటికే దాదాపు 350 మంది చైనా సైనికులు ఆ ప్రాంతానికి వచ్చారు. వారి వద్ద మేకులు కలిగిన ఇనుప కడ్డీలు ఉండగా, భారత సైనికులు మాత్రం తమ తుపాకుల బాయ్ నెట్లనే ఆయుధాలుగా చేసుకుని వారిని ఎదుర్కొన్నారు. సంతోష్ తలకు ఓ పెద్ద రాయి తగలడంతో, ఆయన లోయలోకి జారిపోయారు. మ‌రునాడు న‌దిలో సంతోష్‌బాబు మృత‌దేహం క‌నిపించ‌డంతో భార‌త సైన్యం బ‌య‌ట‌కు తీసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: