దేశంలో క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ఈ రాష్ట్రం...ఆ రాష్ట్రం అనేతేడా లేకుండా ఈ మ‌హమ్మారి విస్త‌రిస్తోంది. అయితే, కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఈ వైర‌స్ విస్తృతి ఉధృతంగా ఉంది. రాజధాని ఢిల్లీలో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. 24 గంటల్లో 3788 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 70,390 పాజిటివ్‌ కేసులు నమోదవగా, బుధవారం వైరస్‌తో 64 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 2365కు చేరింది. 41,437 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 26,588 మంది ఢిల్లీలోని ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.

 

మ‌రోవైపు మ‌న పొరుగు రాష్ట్రమైన క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వంద‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 397 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10 వేల మార్కును దాటి 10,118కి చేరింది. బుధ‌వారం కొత్త‌గా 14 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం మృతుల సంఖ్య 164కు చేరింది. మొత్తం కేసుల‌లో 6,151 మంది డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జిలు, మ‌ర‌ణాలు పోగా మిగిలిన వారు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

 

కాగా, ఇంకో స‌రిహ‌ద్దు రాష్ట్రమైన త‌మిళ‌నాడులో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. ఆ రాష్ర్టంలో రోజురోజుకు క‌రోనా పాజిటివ్ కేసులు అధికంగా న‌మోదు అవుతున్నాయి. బుధ‌వారం ఒక్క‌రోజే కొత్త‌గా 2,865 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 33 మంది ప్రాణాలు కోల్పోయారు.చెన్నైలో అత్య‌ధికంగా 44,205, చెంగ‌ల్ ప‌ట్టులో 4,030, తిరువ‌ల్లూరులో 2,826, తిరువ‌న్న‌మలైలో 1,313, కంచీపురంలో 1,286 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య 67,468కు చేరుకోగా, మృతుల సంఖ్య 866కు చేరింది. 


ఇదిలాఉండ‌గా, రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్త‌మైంది. క‌రోనా నియంత్ర‌ణ కోసం జులై 31వ తేదీ వ‌ర‌కు లాక్ డౌన్ ను పొడిగిస్తున్న‌ట్లు బెంగాల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం అమ‌ల్లో ఉన్న‌ లాక్ డౌన్ ఈ నెల 30తో ముగియ‌నుంది. కేసుల తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో.. మ‌రో నెల రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: