వీణ ‌- వాణి...ఈ అవిభ‌క్త క‌వ‌ల‌ల గురించి, వారు ఎదుర్కంటున‌న ఆరోగ్య స‌మ‌స్య గురించి తెలుగునాట అనేక మందికి తెలుసు. వారు ఎదుర్కుంటున్న బాధ గురించి సైతం ఎంద‌రో త‌ల్ల‌డిల్లుతుంటారు. అయితే, అంత బాధ‌ను ఓర్చుకుంటున్న ఈ అమ్మాయిలు సాధార‌ణ విద్యార్థుల‌కు తీసిపోకుండా త‌మ స‌త్తా చాటారు. హైద‌రాబాద్‌కు చెందిన అవిభ‌క్త క‌వ‌ల‌లైన వీణ - వాణిలు ప‌ది ఫ‌లితాల్లో టాప్ లో నిలిచారు. ఇటీవ‌ల విడుద‌లైన టెన్త్ ఫ‌లితాల్లో వీణ 9.3 జీపీఏ స్కోర్ సాధించ‌గా, వాణి 9.2 జీపీఏ స్కోర్ సాధించి.. అంద‌రితో శ‌భాష్ అనిపించుకుంటున్నారు. 

 

 

అవిభక్త కవలలైన వీణ, వాణి మార్చిలో జ‌రిగిన ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌ను ఎంతో క‌ష్టానికి ఓర్చి పూర్తి చేశారు. యూసఫ్‌గూడలోని స్టేట్ హోం నుంచి సూపరింటెండెంట్ సఫియా ప్రత్యేక అంబులెన్స్‌లో అవిభక్త కవలలిద్దరినీ పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చారు. ఇద్దరూ ఒకేసారి పరీక్ష రాయడానికి వీలులేకపోవడంతో స్టేట్ హోం అధికారులు వీరికి ఇద్దరు సహాయకులను కూడా కేటాయించారు. పరీక్ష రాసేందుకు ఇద్దరికీ తొమ్మిదో తరగతికి చెందిన విద్యార్థులను సహాయకులుగా నియమించారు. హైదరాబాద్ మధురానగర్‌లోని ప్రతిభా హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో వీరిద్దరూ వేర్వేరు హాల్ టికెట్లతో ప‌రీక్ష‌లు రాశారు.  మొద‌టి మూడు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. తాజా ఫ‌లితాల్లో  వీరిద్ద‌రూ మెరుగైన ఫ‌లితాలు సాధించారు.

 

 

వీణ‌- వాణి త‌ల్లి నాగ‌ల‌క్ష్మి మాట్లాడుతూ... అవిభ‌క్త క‌వ‌ల‌లు వీణ - వాణి.. ఇంట‌ర్ లో చేరేందుకు ఆస‌క్తి చూపుతున్నారని తెలిపారు. ఇంట‌ర్మీడియ‌ట్ లో ఎంఈసీ(మ్యాథ్స్, ఎకాన‌మిక్స్, కామ‌ర్స్) చ‌ద‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారని తెలిపారు. భ‌విష్య‌త్ లో కంప్యూట‌ర్ రిలేటెడ్ జాబ్ చేయాల‌న్న‌ది వారి ఆకాంక్ష అని త‌ల్లి తెలిపారు.కాగా, వీరిద్ద‌రూ ఉన్న‌త చ‌దువులు చ‌దవాల‌ని, ఆ చ‌ద‌వుల్లో‌నూ ఇదే రీతిలో అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించాల‌ని ప‌లువురు ఆకాంక్షిస్తున్నారు. వీరి ఉన్న‌త ఉద్యోగం ఆకాంక్ష సైతం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: