దౌలత్​ బేగ్​ ఓల్డీ(డీబీఓ), డెప్సంగ్​ సెక్టర్​లో చైనా దురాక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డేందుకు పెద్ద ఎత్తున సైన్యాన్ని త‌ర‌లిస్తూ క్యాంపుల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు మూడు రోజుల క్రితం భార‌త సైన్యం శాటిలైట్ ద్వారా గ్ర‌హించింది. పెద్ద ఎత్తున సైన్యాన్ని త‌ర‌లి వెళ్తున్న దృశ్యాలు క‌నిపించాయి. దీంతో భార‌త ప్ర‌భుత్వం కూడా అప్ర‌మ‌త‌మై సైన్యాన్ని అటు వైపు వెళ్లాల‌ని సూచించింది. దీంతో ఇప్పుడు గాల్వాన్‌లో మాదిరిగానే చైనా బార్డర్​లో మరోసారి ఘర్షణ తప్పేలా లేద‌న్న అభిప్రాయాన్ని ర‌క్ష‌ణ రంగ నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు.  ఆర్మీ వ‌ర్గాలు కూడా ఇదే విష‌యాన్ని ఆఫ్ ది రికార్డులో ధ్రువీక‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ నెల మొదట్లో పీపుల్స్ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ) బలగాలు డెప్సంగ్​ సెక్టర్​ వైపు కదులుతున్నట్లు శాటిలైట్​ చిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపాయి. 


వాస్త‌వానికి 2013లో చైనా ఈ సెక్టార్​ను ఆక్రమించి, క్యాంపు ఏర్పాటు చేసుకుంది. అయితే భార‌త్ హెచ్చ‌రించ‌డంతో అబ్బే అదేం లేదు...మేం ఎప్పుడో 2016 కన్నా ముందే క్యాంపును తీసేసిన‌ట్లుగా చైనా ఆర్మీ అధికారులు స‌మాధానం తెలిపారు. దీంతో ఆ స‌మ‌స్య అప్ప‌టితో ముగిసిపోయింద‌ని భార‌త్ భావించింది. అయితే తాజాగా డెప్సంగ్​ సెక్టర్​ వైపు కదులుతున్నట్లు శాటిలైట్​ చిత్రాల ద్వారా వెల్ల‌డి కావ‌డంతో భార‌త బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.  అయితే చైనా దుర్మార్గాన్ని ముందే ఊహించిన మన సైన్యం.. గత నెలాఖరులోనే డెప్సంగ్​ సెక్టార్​ దిశగా కొన్ని బలగాలను ముందే పంపించింది. అయితే మ‌రిన్ని బ‌ల‌గాల‌ను మొహ‌రింప జేస్తోంది. 


లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్‌ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్‌పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగిన విష‌యం తెలిసిందే. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: