ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం ఎప్పటి నుంచో నలుగుతూనే ఉంది. రమేష్ కుమార్ వ్యవహారశైలిపై వైసిపి మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా, తెలుగుదేశం పార్టీతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, ఆ పార్టీకి మేలు చేసే విధంగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఎన్నో ఆరోపణలు చేసింది. అయితే ఈ విషయం మొదట్లో పెద్దగా ఎవరు నమ్మలేదు. ఇక ఈ వ్యవహారం కోర్టులో సైతం ఉంది. ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో రాజకీయంగాను, అన్ని రకాలుగానూ వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న సమయంలో కేసీఆర్ చేసిన మేలు ఇప్పుడు జగన్ కు ఉపయోగపడుతోంది. మొదటి నుంచి జగన్ విషయంలో కేసీఆర్ సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నారు. ఒక రకంగా ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ జగన్ కు మేలు చేసే విధంగా వ్యవహరించారు. 


రాష్ట్ర విభజన సమస్యలు, సాగునీటి విషయాల్లో ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి కాస్త విభేదాలు ఉన్నా, ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగానే వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస రావు తో భేటీ అయిన దృశ్యాలు బయటకు రావడం, టిడిపి తో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇరుకున పడ్డారు. ఈ విషయంలో వైసీపీ మొదటి నుంచి చెబుతున్న దాంట్లో నిజం ఉంది అనే అభిప్రాయం కూడా బాగా జనాల్లోకి వెళ్ళింది.


 ఇప్పుడు చంద్రబాబు అనుకూల బిజెపి నాయకులతో కల్సి మంతనాలు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంబంధించిన ఆధారాలు కోర్టుకు కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సమర్పించబోతోంది. ఒకరకంగా ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. అంతేకాకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో తాము మొదటి నుంచి పదేపదే చెబుతున్నా, ఎవరూ పట్టించుకోలేదని, ఇప్పుడది నిజమైందనే విషయం వైసిపి గొప్పగా చెప్పుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఈ విషయంలో హోటల్ సిసి టివి ఫుటేజ్ బయటికి రావడం వెనుక తెలంగాణ ప్రభుత్వం సహకారం చాలానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కెసిఆర్ సహకారంతోనే ఇప్పుడు ఈ వీడియో బయటికి రావడం, నిమ్మగడ్డ తోపాటు టిడిపి ఇరుకున పడడం జరిగిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: