లడక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.  ఓ వైపు చర్చలు, మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాకు... అదేరీతిన సమాధానం చెప్పాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే వాస్తవాధీనరేఖ వెంబడి.. భారీగా బలగాలను తరలింపునకు నిర్ణయించింది.మరోవైపు ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా పూర్తిగా ఉల్లంఘించిందంటూ .. డ్రాగన్ తీరును ఎండగట్టింది భారత విదేశాంగశాఖ.

 

చర్చిద్దామంటోంది..చర్చలు జరుపుతూనే సరిహద్దు వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యాన్ని మోహరిస్తోంది.  ద్వంద్వనీతిని ప్రదర్శిస్తోంది డ్రాగన్. అంతేనా పాత ఒప్పందాలను కాలరాస్తూ పరిహసిస్తోంది. తిరిగి మీరే కవ్వించారంటూ బుకాయిస్తోంది.  డ్రాగన్ నక్కజిత్తుల రణనీతిని ప్రదర్శిస్తోంది. చైనా దూకుడుకు అదే రీతిన సమాధానమిచ్చేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 3వేల488 కి.మీ వాస్తవాధీన రేఖ  వెంబడి భారత్ కూడా భారీగా సైన్యాన్ని తరలించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా భారత సైన్యానికి చెందిన అదనపు బలగాలతో పాటు ఇండో-టిబెట్‌ బోర్డర్ పోలీస్ దళాలను కూడా పంపనున్నట్లు తెలుస్తోంది. 

 


సరిహద్దుల్లోని గల్వాన్‌ లోయ, హాట్ స్ప్రింగ్స్‌, పాంగాంగ్ లేక్‌ మూడు ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్30, 2020 నాటి యథాస్థితిని పునరుద్ధరించాలని సైనిక  కమాండర్ల స్థాయి చర్చల్లో భారత్ .. చైనాకు స్పష్టం చేసింది.గల్వాన్‌ లోయ, గోగ్రాలోని గస్తీ పాయింట్లు 14, 15, 17 వద్ద బలగాలను తగ్గించాలని ఇరువర్గాలు పరస్పరం కోరినట్లు తెలుస్తోంది. బుధవారం నాటి శాటిలైట్ చిత్రాల్లో మాత్రం గల్వాన్‌ లోయలోని 14 నంబర్‌ గస్తీ పాయంట్ వద్ద  చైనా కొత్తగా నిర్మాణాలు చేపడుతున్నట్లు కనబడుతోంది. దానితో పాటు గస్తీ పాయింట్ 15లో భారీగా టెంట్లు కనిపించాయి. గస్తీ పాయింట్ 17 వద్ద పెద్ద ఎత్తున బలగాలను చైనా మోహరించినట్లు సమాచారం. మొత్తానికి సరిహద్దులకు భారీగా భారత సైన్యం తరలివెళ్తోంది. దీంతో అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయోమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: