దేశంలో కరోనా మహమ్మారి వల్ల మనిషిని మనిషి ముట్టుకోవాలంటే భయంతో వణికిపోతున్నారు. ఒకప్పడు రోడ్లపై.. ఇతర జనసమూహాల్లో గుంపులు గుంపులుగా ఉండేవారు.. కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వల్ల సినీ, విద్యా, రవాణా వ్యవస్థకు బాగా దెబ్బపడింది. ఇప్పటివరకు చదువుకున్న పాఠాలు సైతం మరిచిపోతున్నారు.  ఇక కొన్ని ప్రైవేట్ స్కూల్స్ మాత్రం జూమ్ యాప్ ద్వారా విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు తీసుకుంటున్న విషయం తెలిసిందే.  కొందరు వినూత్న మార్గాల్లో పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. లాటిన్ అమెరికా ప్రాంతంలోని కొలంబియాలో రేడియో పాఠాలు చెబుతున్నారు. ఆ దేశంలో ఎక్కువ మంది ప్రజలకు ఇంటర్నెట్‌ అందుబాటులో లేకపోవడంతో అక్కడి ప్రభుత్వం రేడియోలో పాఠాలు రూపొందించింది.

 

 

ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రేడియోలో వింటూ ఎక్సర్‌సైజులు ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఇక ఓ స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన వినూత్న ప్రయోగానికి అందరూ ఆశ్చర్యపోయారు.. ఇక పిల్లలూ మీరు ఎక్కడికీ తప్పించుకోలేరని అంటున్నారు.  ఇంటర్నెట్‌, లాప్‌టాప్‌, స్మార్ట్‌‌ఫోన్లు లేని విద్యార్థుల కోసం జార్ఖండ్‌లోని ఒక స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ వినూత్న పద్ధతిలో పాఠాలు బోధిస్తున్నారు. జార్ఖండ్‌లోని బంకతి మిడిల్‌ స్కూల్‌ హెడ్‌‌మాస్టర్‌ శ్యామ్‌ కిషోర్‌ గాంధీ స్కూల్‌ చుట్టూ, పిల్లలు ఎక్కువగా ఉండే చోట మైక్‌లు పెట్టించారు.

 

అయితే ఈ పాఠాలు విని పిల్లలకు ఏమైనా సందేహాలు వస్తే.. తన ఫోన్‌కు కానీ మిగిలిన ఎవరైనా స్టాఫ్‌ ఫోన్‌కు మెసేజ్‌ చేస్తే సరిపోతుంది. మరుసటి రోజు వారికి అర్థం అయ్యేలా చెబుతున్నారు. ఏప్రిల్‌ 16 నుంచి ప్రతిరోజూ రెండు గంటల పాటు తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హెడ్ మాస్టర్ మాట్లాడుతూ.. ఇక్కడ కొంత మంది పిల్లలకు స్మార్ట్ ఫోన్లు లేవు.. అందుకే అందరికీ అర్థమయ్యేలా.. పనికి వచ్చేవిధంగా పాఠాలు బోధిస్తున్నామని అన్నారు.  ఇలా నిర్వహిస్తున్న తరగతులకు దాదాపు 100 శాతం మంది హాజరవుతున్నారని కొన్ని రిపోర్టుల ద్వారా స్పష్టమవడంతో ఈ మాస్టర్‌ చేసిన పనిని అందరూ ప్రశంసిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: