అవును ఇలా చెప్పడం కాదు కానీ అది ఏమైనా చిన్న పనా. చాలా పెద్ద పని. ఇంకా చెప్పాలంటే చాలా చిక్కుముడులు ఉన్న పని. కేంద్రం తలచుకున్నా కానీ పని. ఎందుకంటే దాని చుట్టూ తేన తుట్టె ఉంది. దాంతో ఒక్కసారిగా తేనెటీగలు రెక్కలు విప్పుకుంటే చాలా పెద్ద ముప్పు.

 

అదే కాపులను బీసీలలో కలపడం. నిజానికి ఇది వినడానికి చాలా చిన్న విషయంగా ఉంది. కానీ కాపులను బీసీల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. బీసీల రిజర్వేషన్ శాతం పెంచాలి. ఇప్పటికే దీని మీద సుప్రీం కోర్టు యాభై శాతం మించరాదు అంటోంది.ఇక మరో వైపు దేశంలో చాలా కులాలు బీసీల్లో కలపమని, ఎస్సీల్లో కలపమని ఆందోళనలు చేస్తున్నాయి.

 

ఒక్కసారి కనుక కేంద్రం ఈ సమస్యను టేకప్ చేసిందా వారూ వీరు అని చూడకుండా అందరూ మీద  పడిపోతారు. దాంతో రిజర్వేషన్లు నూటికి నూరు శాతం పొడిగించినా చాలనన్ని  కులాలు ఉన్నాయి.ఈ సంగతి తెలిసినా రాజకీయ అనుభవశాలి చంద్రబాబు 2014 ఎన్నికల ముందు కాపులను మభ్యపెట్టారు. ఫలితంగా ముద్రగడ పద్మనాభం ఉద్యమించి అయిదేళ్ళూ బాబుకు ఇక్కట్లు ఏంటో చూపించారు.

 

ఇక ఎన్నికల వేళ జగన్ మాత్రం ఈ సమస్య తన చేతుల్లో లేదని అనేశారు. దాంతో ఆయన్ని అడిగే నైతిక హక్కు ముద్రగడ లాంటి వారికే లేకుండా పోయింది. ఇదంతా కాపు రిజర్వేషన్ల వెనక ఉన్న కధ. 2014 నుంచి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్న‌ జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఇది తెలియనిదికాదు, 

 

పైగా ఆయన ఇపుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు. కాపుల ప్రతినిధిగా మారాలనుకుంటే పవన్ ఈ సమస్య ఏదో బీజేపీ పెద్దల చెవిన వేసి వారిని ఒప్పించి ఒడుపుగా బీసీల్లోకి కాపులను చేర్పించడం, అక్కడ వారికంటూ రిజర్వేషన్లు ప్రత్యేకంగా పెంచడం చేస్తే పవన్ రాజకీయ జాతకమే మారుతుంది. మిగిలిన సామాజిక వర్గాల సంగతెలా ఉన్నా కాపులు మాత్రం పవన్ని దేవుడిలా చూస్తారు. ఏపీలో ఒక కీలకమైన నేతగా ఎదగవచ్చు. అద్రుష్టం బాగుంటే సీఎం కూడా కావచ్చు. 

 

మరి రాజమార్గం ఉండగా దాన్ని వదిలేసి కాపులకు ఎలాంటి హామీ ఇవ్వన్ని జగన్ మీద ఫైర్ అవడం అంటే పవన్ రాంగ్ ట్రాక్ పాలిటిక్స్ చేస్తున్నాడనే అనుకోవాలి. కాపులు కూడా ఈ విషయంలో అర్ధం చేసుకున్నారు. తమను  బీసీలుగా చేసే అధికారం కేంద్రానికి మాత్రమే ఉందని వారికీ తెలుసు. మరి పవన్ కాపుల విషయంలో జగన్ని ఆడిపోసుకుంటే వారు ఆయాచితంగా మద్దతు ఇస్తారనుకోవడం భ్రమే. పవన్ చంద్రబాబు మాదిరి పాలిటిక్స్ చేయకుండా తానే చెప్పుకున్నట్లుగా కొత్త రాజకీయం చేయాలంటే కాపులకు రాజమార్గాన న్యాయం చేయడమే ఉత్తమం.
 

మరింత సమాచారం తెలుసుకోండి: