ఇటీవ‌ల మ‌న స‌రిహద్దుల్లో పొరుగు దేశ‌మైన చైనా పాల్ప‌డిన దుశ్చ‌ర్య‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్మ‌యాన్ని క‌లిగించిన సంగ‌తి తెలిసిందే. అయితే, చైనా కుటిలయత్నాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. తూర్పు లఢక్‌ ప్రాంతంలోని గాల్వాన్‌లో ఈనెల 15న ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరగకముందే భారత్‌ సరిహద్దుల్లో డ్రాగ‌న్ కంట్రీ చేసిన చ‌ర్య‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. తూర్పు లఢక్‌ సరిహద్దుల్లోని గాల్వాన్‌ నదీ పరీవాహక ప్రాంతంలో చైనా చొరబాటు నిజమేనని తాజాగా అందిన ఉప గ్రహ ఛాయాచిత్రాలు రుజువు చేస్తున్నాయి. చైనా మాటువేసి సైనిక శిబిరాలు, పలు నిర్మా ణాలు చేపడుతున్న గాల్వాన్‌ నది గట్టు ప్రాంతం వాస్తవాధీన రేఖ సమీపంలోని భారత భూ భాగంలోనే ఉంది. నిన్నమొన్నటివరకు ఆ ప్రాంతం వరకు భారత బలగాలు పహారా కాస్తూనే ఉన్నాయి. అయితే గడచిన నెల రోజులకు పైగా పరిస్థితిలో తీవ్రమైన మార్పు వచ్చింది. 

 


జూన్‌ 15న గాల్వాన్‌లో ఇరుదేశాల సైనికుల మధ్య భీకర ఘర్షణ జరగడం, 20మంది భారత సైనికులు (కల్నల్‌ సహా) ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘ‌ర్ష‌ణ‌కు కార‌ణం చైనా ఆక్ర‌మ‌ణ బుద్ధి. గాల్వాన్ ప్రాంతంలోని పెట్రోల్‌ పాయింట్‌ 14 (పీపీ14) వ్యూహాత్మకంగా కీలకమైనది. ఇక్కడ నుంచి దిగువకు చూస్తే భారత సైనికుల కదలికలు స్పష్టంగా కనిపిస్తాయి. భారత్‌కూ అది కీలకమే. అక్కడే ఉంటే చైనా కదలికలు కనిపిస్తాయి. ఈ కారణంగానే చైనా గాల్వాన్‌ నదీ ప్రాంతంపై కన్నేసి పక్కా ప్రణాళిక ప్రకారం ఘర్షణలకు ఉసిగొల్పి తిష్టవేసిందని అర్థమవుతోంది. నిజానికి ఈ ప్రాంతం వివాదాస్పద స్థలంగానే ఉంది. ఇది కచ్చితంగా భారత్‌దేనని చెప్పడానికి లేదు. కాకపోతే కొన్ని దశాబ్దాలుగా భారత్‌ పహారాలో మాత్రం ఉంది. దీనిపై చర్చలు జరగాల్సి ఉంది. ఇంతలో చైనా చొరబడింది. చైనా ఇప్పుడు తిష్టవేసిన గాల్వాన్‌ గట్టు ప్రాంతం తూర్పు లడఖ్‌కు, ఎల్‌ఏసీకి కేవలం 137 మీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: