దేవుడు తనకు మారుగా భూమిపైకి అమ్మను పంపించారని అంటుంటారు. నిజమే నవమాసాలు మోసి మనకు జన్మనిచ్చిన తల్లి రుణం ఈ జన్మలో తీర్చుకోలేం. బిడ్డ మంచీ చెడ్డా చూడటంలో తల్లిని మించి ఇంకెవరూ ఉండరు.  ఈ కాలంలో కన్న తల్లిదండ్రులను వారి సంతానం వృద్దాశ్రమంలో వేస్తున్నారు.. అనాధలుగా వదిలివేస్తున్నారు.  కానీ పుట్టినప్పుడు ఆ బిడ్డకు ఏం జరిగినా ఆ తల్లి ప్రాణాలు విల విలలాడిపోతాయి.  తన బిడ్డ ఎలా ఉన్నా తన ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటుంది.  పిల్లలు తల్లిదండ్రులను దిక్కులేనివాళ్లను చేస్తున్న ఘటనలు చూస్తున్నాం. కానీ, ఎక్కడా బిడ్డలను, తల్లిదండ్రులు దిక్కులేనివారిని చేయరు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఓ 28 ఏళ్ల మహిళకు ఓ వింత శిశువు జన్మించాడు... ఆ విషయం డాక్టర్లు సైతం తల్లికి చెప్పడానికి సంకోచించారు.  కానీ ఆ తల్లి తన బిడ్డను చూసుకొని అన్న మాట ఒక్కటే..  ‘నా బిడ్డను నేను బాగా చూసుకుంటాను’.. అదీ తల్లి ప్రేమ అంటే.

 

మధ్యప్రదేశ్‌లో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది.  అంతా పురిటి నొప్పులను భరించి బిడ్డను కన్నది. అయితే బిడ్డను చూడగానే వైద్యులు నోరెళ్లబెట్టారు. చాలా సేపటివరకు ఆ తల్లికి బిడ్డను చూపించలేకపోయారు. దీంతో ఆ తల్లి సహా కుటుంబ సభ్యులు అనుమానంతో తమ బిడ్డను ఎందుకు చూపించడంలేదని వైద్యులను అడిగారు. అందుకు వారు ఏం చెప్పాలో తెలియక సంశయించారు. కుటుంబ సభ్యులు వత్తిడి చేయడంతో ఆ బిడ్డను చూపించారు. వారి ముఖాల్లోనూ అదే ఆశ్చర్యం. పుట్టిన బిడ్డకు కాళ్లు, చేతులు లేవు.

 

అయ్యో బిడ్డ ఇలా ఎలా పుట్టాడని? కుటుంబ సభ్యులందరూ ఒక్కసారిగా కృంగిపోయారు.. కన్నీరు పెట్టుకున్నారు. కానీ ఆ  తల్లి మాత్రం తన బిడ్డను అక్కున చేర్చుకుని ‘నా బిడ్డను నేను బాగా చూసుకుంటాను’ అని చెప్పింది. ఆ తల్లి మనసుకు వైద్య బృందం మరింత ఆశ్చర్యపోయింది.  ఆటోసోమల్ రిసెస్సివ్ కంజెనిటల్ డిజార్టర్ కారణంగా శిశువు అలా జన్మించింది. సింపుల్‌గా దీన్ని టెట్రా-అమెలియా అని పిలుస్తారు. ఆ చిన్నారిని పరీక్షించేందుకు కూడా ఆ తల్లి ఒప్పుకోలేదు.  తన బిడ్డ ఎలా ఉన్నా  కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: