ప్ర‌స్తుతం ఇండో చైనా బోర్డర్లో టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇదే స‌మ‌యంలో ఇండియా చైనా దేశాల మధ్య ప్రస్తుతం ఆర్థికపరమైన యుద్ధం జరుగుతోంది.  పరిస్థితులు ఎప్పుడు ఎలా మారతాయో తెలియని విధంగా ఉన్నది.  గాల్వాన్ లోయలో జరిగిన దాడి తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఇలాంటి త‌రుణంలో ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వివిధ అంశాల‌పై ప్ర‌ధాని స్పందించారు. అయితే ప్రస్తుతం చైనా-భారత్ ల మధ్య వివాదం కొనసాగుతున్నప్పటికీ మోడీ తన ప్రసంగంలో చైనా గురించి ప్రస్తావించలేదు. ఈ విషయంపై ఏఐఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ త‌న‌దైన శైలిలో కామెంట్ చేశారు. 

 

ప్రధాని తన ప్రసంగంలో చైనా గురించి మాట్లాడుతారని అంతా అనుకుంటే చనా (పప్పుధాన్యాలు)పై మాట్లాడుతూ తన ప్రసంగాన్ని ముగించారు అంటూ మోదీ స్పీచ్‌పై ఓవైసీ ఎద్దేవా చేశారు. ముస్లింలు పవిత్రంగా జరుపుకునే ఈద్‌ గురించి సైతం ప్రధాని తన ప్రసంగంలో ప్రస్తావించలేదని ఓవైసీ త‌ప్పుప‌ట్టారు. రాబోయే నెలల‌కు సంబంధించిన‌ పలు పండుగల గురించి మాట్లాడిన ప్రధాని మోదీ ఈద్‌ గురించి మాత్రం చెప్పనేలేదని ఓవైసీ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. 

 

కాగా, దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ముఖ్య పథకాల్లో ఒకటైన గరీబ్‌ కల్యాణ్‌ యోజనను నవంబరు నెల చివరి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన స‌మయంలో ఈ మేర‌కు వెల్ల‌డించారు. రూ. 90 వేల కోట్ల వ్యయంతో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించనున్నట్లు వెల్లడించారు. కుటుంబంలోని ప్రతిఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం, నెలకు కిలో చొప్పున కందిపప్పును ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు. గడిచిన 3 నెలల్లో 20 కోట్ల పేద ప్రజల కుటుంబాలకు రూ. 31 వేల కోట్లను డిపాజిట్‌ చేశామన్నారు. అదేవిధంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18 వేల కోట్లను జమ చేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: