దేశ ఆర్థిక రాజధానిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. థానే సహా కొంకణ్ ప్రాంతాలు.. జలదిగ్భంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 

కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ముంబై మహానగరానికి భారీ వర్షాల రూపంలో మరో విపత్తు ఏర్పడింది. థానే సహా మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతాలను వరుసగా మూడో రోజు వర్షాలు ముంచెత్తాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో  భారీగా వరద నీరు చేరింది. రాబోయే 24 గంటల్లో ముంబయి సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో భారీగా వర్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు  సెంట్రల్ ముంబైలోని హింద్‌మతా, తూర్పు శివారులోని చెంబూర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. గడచిన 24 గంటల్లో దక్షిణ ముంబైలోని కొలాబా అబ్జర్వేటరీలో 129.6 మి.మీ వర్షపాతం నమోదుకాగా, శాంతాక్రూజ్‌ ప్రాంతంలో 200.8 మి.మీ. వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ వర్గాలు తెలిపాయి. కొంకణ్ ప్రాంతంలోని సింధ్‌దుర్గ్‌లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
 


విదర్భలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు ముంబైలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు కూలగా, కొమ్మలు విరిగిపడినట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి.  

 

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ముంబైవాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. పలు ప్రాంతాలు జలమయం కావడంతో రోడ్లపై వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ జామ్‌లతో సమయమంతా రోడ్లపైనే గడపవలసిన దుస్థితి దాపురించింది. హింద్‌మాత, ధారవి క్రాస్ రోడ్, దాదర్ టీటీ, శక్కర్ పంచాయత్, చెంబూరు వంతెన వంటి ప్రాంతాలు వర్షపు నీటిలో చిక్కుకున్నాయి. వెస్టర్న్ఎక్స్‌ప్రెస్ హైవే వద్ద రోడ్లు జలమయం కావడంతో జోగేశ్వర్ విక్రోలీ లింక్ రోడ్డులో వాహనాలు చాలా నెమ్మదిగా కదిలాయి. ఖేట్వాడీ, బండ్‌స్టాండ్, నానా చౌక్, జేజే జంక్షన్, మహాలక్ష్మి జంక్షన్ తదితర ప్రాంతాలు జలమయం అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: