కేరళ గోల్డ్ స్మగ్లింగ్ స్కామ్‌... ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. బంగారం అక్రమ రవాణాలో ఆరోపణలను ఎదుర్కొంటున్న వ్యక్తులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సీఎం విజయన్... తక్షణం పదవికి రాజీనామా చేయాలని యూడీఎఫ్ కూటమి డిమాండ్ చేస్తోంది. ప్రధాన నిందితురాలు స్వప్న సురేష్‌తో .. పినరయి విజయన్‌కు దగ్గర సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. గతంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్న స్వప్న సురేష్‌ను కీలకమైన పదవిలోకి ఎందుకు తీసుకున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. 

 

ఈ నెల 2న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన పార్శిల్‌ నుంచి 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. యూఏఈ కాన్సులేట్‌ అధికారిగా గతంలో పనిచేసిన స్వప్న సురేష్ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం స్వప్న సురేష్... కేరళ ఇన్ ఫర్ మేషన్  టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్ మార్కెటింగ్ లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ కేసు నుంచి ఆమెను తప్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్రంగా ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ కార్యదర్శి శివశంకర్‌ను ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. 

 

కేరళ గోల్డ్‌ స్మగ్లింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి పాత్ర ఉందని.. దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. కేరళ ప్రతిపక్ష నేత రమేష్.. ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. ఈ కుంభకోణంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. యూఏఈ రాయబార కార్యాలయం పేరుతో 30 కోట్ల విలువైన బంగారం అక్రమంగా దేశంలోకి వచ్చిందని... దీనిపై కచ్చితంగా సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. యూఏఈ కాన్సులేట్ పేరుతో తిరువనంతపురానికి బంగారాన్ని ఎవరు రవాణా చేశారన్న దానిపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా విచారణ జరుపుతోంది. మరోవైపు  ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఏమీ లేదని.. సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేష్‌ను IT విభాగంలోకి తీసుకున్న ఐఏఎస్ అధికారి శివశంకర్‌ను ఆ పదవి నుంచి తొలగించామని చెప్పారు.

 

కేరళ గోల్డ్‌ స్కామ్ మొత్తం స్వప్న సురేష్ అనే మహిళ చుట్టూనే తిరుగుతోంది...? ఇంతకీ ఎవరీమె..? ముఖ్యమంత్రితో పాటు కేరళకు చెందిన ప్రముఖులతో కలిసి ఫోటోలు దిగేంత సాన్నిహిత్యం ఈమెకు ఎందుకుంది...? స్వప్న సురేష్ కెరీర్ మొత్తం వివాదాల చుట్టూనే తిరుగుతోంది. కేరళ రాజధాని తిరువనంతపురంలో ట్రావెల్ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించింది స్వప్న సురేష్.  2010-11 మధ్యలో కేరళ నుంచి మకాం అబు దుబాయ్‌కి మార్చింది. దుబాయ్ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న సమయంలో అనేక ఆరోపణలు రావడంతో తిరిగి కేరళకు చేరుకుంది. ఆ తర్వాత తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎయిర్‌ఇండియాకు చెందిన విభాగంలో ఏజెంట్‌గా చేరింది. ఆ తర్వాత యూఏఈ కాన్సులేట్‌ లో ఉద్యోగం సంపాదించింది. అక్కడ కూడా ఆరోపణలు రావడంతో ఉద్యోగంలో నుంచి తొలగించారు. ప్రస్తుతం కేరళ ఐటీ విభాగానికి చెందిన కంపెనీలో లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తోంది. దౌత్యమార్గం ద్వారా అక్రమంగా తిరువనంతపురానికి బంగారాన్ని రవాణా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: