గాలి ద్వారా కరోనా వ్యాప్తిస్తుందన్న వాదనను కొట్టిపారేయలేమంటోంది... ప్రపంచ ఆరోగ్య సంస్థ. వైరస్‌ గాల్లో 8 గంటల పాటు యాక్టివ్‌గా ఉంటుందని అధ్యయనాల ద్వారా గుర్తించడం జరిగిందని... అయితే మరిన్ని పక్కా ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. ఎక్కడ ఉన్నా సరే... ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని కోరింది. 

 

ఇప్పటివరకూ కరోనా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే రెండు గజాల దూరం పాటించాలని కోవిడ్ ప్రోటోకాల్ లో పెట్టింది. అయితే  గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనడానికి సరైన ఆధారాలు ఉన్నాయంటూ ఇటీవల వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం డబ్ల్యూహెచ్‌వోకు లేఖ రాసింది. వైరస్‌ వ్యాప్తి సంబంధించిన మార్గదర్శకాల్ని సవరించాలని కోరింది. దీనిపై అధ్యయనం చేసిన డబ్ల్యూహెచ్‌వో... గాల్లో వైరస్‌ 8 గంటల పాటు యాక్టివ్‌గా ఉంటుందని గుర్తించినట్లు పేర్కొంది. 

 

జనం రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, గాలి, వెలుతురు సరిగా లేని ప్రదేశాల్లో గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని అధ్యయనాల ద్వారా తెలుస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని బలమైన ఆధారాల్ని సేకరించి విశ్లేషించాల్సి ఉందని స్పష్టం చేసింది. గాలి ద్వారా, చిన్న చిన్న తుంపర్ల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందన్న వాదనపై చర్చిస్తున్నామని... పూర్తి స్థాయిలో సమీక్ష జరిపిన తర్వాత మార్గదర్శకాల సవరణపై త్వరలో ఓ ప్రకటన విడుదల చేస్తామంది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ... ఎక్కడ ఉన్నా సరే... తప్పనిసరిగా మాస్క్‌ ధరించి వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలని సూచించింది.

 

గాలి ద్వారా, అతి చిన్న తుంపర్ల కారణంగా వైరస్ వ్యాపిస్తుందన్న వాదనను వైద్య వర్గాలు ఇప్పటివరకూ వ్యతిరేకిస్తూ వచ్చాయి. ఈ వాదన రుజువు చేయడానికి బలమైన ఆధారాలు చూపించాల్సి ఉంటుందని అన్నాయి. కానీ... శాస్త్రవేత్తలు మాత్రం గాలి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని చాలా గట్టిగా చెబుతున్నారు. డబ్ల్యూహెచ్‌వో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను విశ్లేషిస్తోంది. గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తోందని రుజువైతే ఇప్పటి వరకు మహమ్మారి కట్టడికి డబ్ల్యూహెచ్‌వో ఇచ్చిన మార్గదర్శకాల్లో మార్పులు చేయాల్సి ఉంటుంది. భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు మరింత పకడ్బందీగా అమలయ్యేలా కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వాలు సైతం తమ వైద్య విధానాల్లో మార్పులు చేసుకోవాల్సిన అవసరం రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: