అమెరికా అన్నంతపనీ చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి వైదొలగుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్ఓ పనిచేస్తోందని ఆరోపిస్తూ ఇప్పటికే ఆ సంస్థకు నిధులు ఇవ్వడం ఆపేసిన అమెరికా... మరో ఏడాదిలో వైదొలిగే ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించింది. 

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ  కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది... అమెరికా. కరోనా తీవ్రతను దాచిపెట్టి ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ విలయానికి కారణమైన చైనాకు అనుకూలంగా వ్యవహరించిందన్న ఆగ్రహంతో... డబ్ల్యూహెచ్ఓకు గత ఏప్రిల్‌ నుంచి నిధులివ్వడం ఆపేసిన అగ్రరాజ్యం... ఇప్పుడు ఆ సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు ఐక్యరాజ్య సమితితో పాటు... అమెరికా కాంగ్రెస్‌కు కూడా అధికారికంగా తెలియజేసింది.

 

డబ్ల్యూహెచ్ఓ నుంచి తప్పుకునేందుకు అమెరికా నోటిఫై చేసిందని... అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఇది పూర్తయ్యేందుకు ఏడాది సమయం పడుతుంది. 2021 జూలై 6 నాటికి డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలిగే ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 

తాము సూచించిన సంస్కరణలను అమలు చేయనందుకు నిరసనగా డబ్ల్యూహెచ్ఓ  నుంచి వైదొలుగుతున్నట్లు మే నెలలో ప్రకటించింది... అమెరికా. రెండు నెలల్లోనే వైదొలిగే ప్రక్రియ కూడా మొదలుపెట్టేసింది. అయితే ట్రంప్‌ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజూ వేల మందికి వైరస్‌ సోకుతున్న కారణంగా... బాధితులకు చికిత్స కోసం ఆస్పత్రుల్లో పడకలు కూడా సరిపోని పరిస్థితుల్లో... డబ్ల్యూహెచ్ఓ  నుంచి వైదొలగడం దేశాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టడమేనని డెమోక్రాట్లు మండిపడుతున్నారు.

 

ఈ చర్య ద్వారా ప్రపంచంలో అమెరికా ఒంటరిగా మిగులుతుందని... అమెరికన్ల ఆరోగ్యం మరింత విషమ పరిస్థితుల్లోకి నెట్టబడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము అధికారంలోకి స్తే... డబ్ల్యూహెచ్ఓ తో మళ్లీ కలిసి పని చేస్తామని... అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జో బైడెన్‌ ప్రకటించారు. మొత్తానికి అమెరికా అన్నంత పని చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అగ్రరాజ్యం తప్పుకుంటున్నట్టు సంకేతాలు ఇచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: