భారత్‌ విషయంలో ఎప్పుడూ కుట్రలు చేయడం, విషం కక్కడం చేసే పాకిస్థాన్‌... మరోసారి అలాంటి బుద్ధినే ప్రదర్శించింది. తమ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌... మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి నిరాకరించారని అంటోంది. అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా చూపేందుకు... పాక్‌ మరో కుట్రకు తెరతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్‌ చెరలో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌ భూషణ్‌ జాదవ్‌ విషయంలో... మళ్లీ కొత్త కుట్రకు తెరతీసింది... దాయాది దేశం. తనకు విధించిన మరణ శిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయడానికి జాదవ్‌ నిరాకరించినట్లు పాకిస్థాన్‌ చెబుతోంది. ముందు దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్‌పైనే ముందుకు వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు చెప్పుకొస్తోంది. మరణ శిక్షపై సమీక్ష కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసేందుకు జూన్‌ 17న కుల్ భూషణ్‌ జాదవ్‌కు అనుమతి ఇచ్చామని, అయితే ఆయన దానికి నిరాకరించారని... పాక్‌ అదనపు అటార్నీ జనరల్‌ అహ్మద్‌ ఇర్ఫాన్‌ తెలిపారు. ఇదే సమయంలో జాదవ్‌ను కలిసేందుకు రెండోసారి కాన్సులర్‌ యాక్సెస్‌ ఇవ్వబోతున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. 

 

2016లో ఇరాన్ నుంచి జాదవ్‌ను అపహరించిన పాక్‌ ఏజెంట్లు... గూఢచర్యం చేసేందుకు బలూచిస్థాన్లోకి ప్రవేశించాడని ఆరోపిస్తూ అరెస్ట్‌ చేశారు. 2017 ఏప్రిల్‌లో పాకిస్థాన్‌ మిలిటరీ కోర్టు జాదవ్‌కు మరణశిక్ష విధించింది. భారత్‌ మాత్రం... ఇరాన్‌లో ఉంటున్న జాదవ్‌ను పాక్‌ కిడ్నాప్‌ చేసిందని ఆరోపిస్తూ... ఆయనకు పాక్‌ విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం... 2017 మే 18న జాదవ్‌ మరణశిక్షపై స్టే విధించింది. ఆ తర్వాత ఇరు దేశాల వాదనలు విని... సరైన సాక్ష్యాధారాలు సమర్పించే దాకా ఉరిశిక్షను నిలుపుదల చేస్తున్నట్లు నిరుడు జులైలో తీర్పు చెప్పింది. 16 మంది న్యాయమూర్తుల్లో 15 మంది భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో... అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు చుక్కెదురైంది. 

 

అంతర్జాతీయ సమాజం ముందు భారత్‌ను దోషిగా నిలబెట్టాలంటే... కుల్‌భూషణ్‌ తన తప్పును అంగీకరిస్తున్నట్లు పాకిస్తాన్‌ నిరూపించగలగాలి. అందుకే... మరణశిక్షపై రివ్యూ పిటిషన్‌ వేయకుండా... క్షమాభిక్ష పిటిషన్‌పైనే జాదవ్ ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతోంది. అంటే... కుల్‌భూషణ్‌ తన తప్పును అంగీకరించారని చెప్పకనే చెబుతోంది. తీర్పును సమీక్షించాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడంపై... పాక్‌తో భారత్‌ సంప్రదింపులు జరుపుతున్న తరుణంలో వెలువడిన ఈ ప్రకటన వెనుక... కచ్చితంగా కుట్ర ఉందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: