భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 26,506 మందికి కొత్తగా కరోనా సోకిందని  తెలిపింది. ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 475 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో కరోనా వైరస్ భూతం విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులోనే 15 మంది మరణించారు.  తాజాగా రాష్ట్రంలో 1576 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటిన్‌లో వెల్లడించారు. ఇప్పటివరకు 11లక్షల 15వేల 635 కరోనా పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. 13,194 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం కోలుకొని డిశ్చార్జి అయ్యారని వివరించారు.

 

11,936 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక  చిత్తూరు జిల్లాలో ఈ ఒక్కరోజే అత్యధికంగా 208 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 292 మంది కరోనా బారిన పడి మృతిచెందారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో పట్టణ ప్రముఖుడొకరు(84) కరోనాతో మృతి చెందగా ఆయన కుటుంబంలో 22మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  బుధవారం మధ్యాహ్నం అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌ కోవిడ్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందినట్లు సమాచారం. వారిది ఉమ్మడి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని నగరంలో మంచి పేరు కూడా ఉంది.

 

గత వారం ఆయన సతీమణి కన్నుమూశారు.. దాంతో అంత్యక్రియలకు తమిళనాడు నుంచి బంధువులు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం ఆయన కుమారుడికి కరోనా సోకడంతో ఆస్పత్రికి వెళ్లారు. ఇప్పుడు పాజిటీవ్ నిర్ధారణ అయిన వారిలో 16 మంది సదరు పెద్దమనిషి కుటుంబ సభ్యులే.. ఇక మిగిలిన ఆరుగురు పక్కింట్లో ఉన్న తమ్ముడి కుటుంబీకులు. వీరిలో పదిమంది పురుషులు, 11మంది మహిళలున్నారు.  ఈనేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా రావడంతో చుట్టుపక్కట కుటుంబ సభ్యుల్లో టెన్షన్ మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: