తెలంగాణ రాష్ట్రంలో కరోనా కరాళనృత్యం చేస్తున్నా లెక్క చేయ‌కుండా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు జిల్లాల‌ను చుట్టేస్తున్నారు. రోజు రెండు మూడు సమీక్షల్లో బిజీగా ఉంటున్న ఆయన.. తాజాగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా పర్యటనకు రెడీ అయ్యారు. కరోనా నిబంధ‌న‌లు పాటిస్తూనే  జిల్లాల పర్యటనల్ని పూర్తి చేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాప‌న‌లు చేస్తున్న మంత్రి .. విప‌క్షాల రాజ‌కీయ విమర్శల్ని సమర్థంగా తిప్పికొడుతున్నారు. 

 

క‌రోనా విభృంభిస్తున్న వేళ  టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్  ప్రజలతో బిజీబిజీగా గ‌డుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు శంక‌ర్ నాయ‌క్‌, గ‌ణేష్ బిగాల‌, బాజి రెడ్డి గోవర్ధన్‌, గొంగిడి సునీతలు క‌రోనా బారిన ప‌డ్డారు. కరోనా ఈ రేంజ్‌లో విజృంభిస్తున్నా.. కేటీఆర్‌ మాత్రం ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారితోనే ఉండాల‌నే ఉద్దేశంతో నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అయితే లెక్కేలేదు. రోజుకు మూడు నాలుగు మండ‌లాలకు వెళ్లొస్తున్నారు. అయితే ప్రజలకు భ‌రోసా ఇచ్చేందుకే  కేటీఆర్ పర్యటిస్తున్నారని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. 

 

అప్పట్లో క‌రోనా కేసులు వెయ్యికి చేర‌డంతో  వ‌రంగ‌ల్ జిల్లా  టూర్  వాయిదా వేసుకున్నారు కేటీఆర్‌. ఆ త‌ర్వాత నల్గొండ జిల్లా టూర్ వాయిదా వేయ‌మ‌ని కోరినా  ప‌ట్టించుకోలేదు. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీలు నెర‌వేర్చేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయ‌డంతో  వాయిదాకు స‌సేమిరా అన్నారు. రైతు బంధు చెక్కుల పంపిణీ, రైతు వేదిక‌ల నిర్మాణాలకు శంకుస్థాప‌న.. ఇలా అన్నింటిలో  పాల్గొంటూ ప్రజాప్రతినిధులకు సూచ‌న‌లు చేశారు కేటీఆర్‌. మాస్క్‌ ధ‌రించ‌డం, భౌతిక దూరం పాటించడం వంటివి స్వయంగా అమలుపరుస్తూ.. ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపాల‌ని కోరారు.

 

అటు విప‌క్షాలు చేస్తున్న రాజ‌కీయ విమర్శలకు టిఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిండెట్ ఘాటుగానే బదులిస్తున్నారు. మ‌రో నాలుగేళ్లు  ఎలాంటి ఎన్నిక‌లు లేవనీ... ఇది రాజ‌కీయాల‌కు స‌మ‌యం కాదనీ.. విమర్శలతో కరోనా వారియ‌ర్స్ ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దని హిత‌వు ప‌లికారు. తామూ కేంద్రంపై విమర్శలు చేయగలమనీ.. ఇది సమయం కాదనే ఊరుకుంటున్నామని కౌంటర్‌ ఇచ్చారు. 

 

ఇక కేటీఆర్‌ నిర్వహిస్తున్న శాఖాప‌ర‌మైన  స‌మీక్షా స‌మావేశాలకు కొదువ‌లేదు. ఈనెల 9న ఒకేరోజు ఉద‌యం నుంచి సాయ‌ంత్రం వ‌ర‌కు మూడు కీల‌క‌మైన స‌మావేశాలు నిర్వహించారు. హైద‌రాబాద్ రోడ్లు, యుఎస్ఐ బీసీ పెట్టుబ‌డుల వెబ్‌నార్‌తో పాటు  మ‌రో సెమినార్‌లో  పాల్గొన్నారు. కరోనా స‌మ‌యంలో  రాష్ట్రానికి పెట్టుబ‌డులు చేజార‌కుండా జాగ్రత్తపడుతున్నారు. ఇటు మంత్రిగా.. అటు టిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్  ప్రెసిడెంట్‌గా.. క‌రోనా స‌మ‌యంలో  ప్రజల మ‌ద్య ఉండేందుకు కేటీఆర్ షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు. ఈనెల 13న పాల‌మూరు జిల్లా టూర్ తర్వాత  మిగిలిన  జిల్లాల టూర్లకు ప్లాన్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: