దేశంలో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. కొత్తగా నమోదవుతున్న రికార్డులు పాత రికార్డులను చెరిపివేస్తున్నాయి. తొలిసారిగా నిన్న రికార్డు స్థాయిలో కేసుల సంఖ్య 25 వేల మార్క్‌కు చేరింది. మరోవైపు వైరస్ కట్టడికి కోసం రాష్ట్రాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కేరళ, యూపీ వంటి రాష్ట్రాలు మరోసారి పూర్తి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి.

 

కరోనా మహమ్మారి భారతదేశాన్ని కబళిస్తోంది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు.. భయపెడుతున్నాయి. మొత్తం బాధితుల సంఖ్య 7 లక్షల 67 వేలకు పైగా చేరింది. మరో 487 మంది వైరస్‌కు బలయ్యారు. మొత్తం మరణాల సంఖ్య 21 వేల 129కి చేరింది. ప్రస్తుతం 2 లక్షల 69 వేల 789 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి శాతం 62గా ఉంది.

 

మ‌హారాష్ట్ర, త‌మిళ‌నాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో క‌రోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది.  మ‌హారాష్ట్రలో కొత్తగా 6 వేల 603 కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య   2 లక్షల 23 వేల 724గా న‌మోదైంది. వీరిలో ఇప్పటివరకు  9 వేల 448మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 17 వందల మంది వైరస్‌తో చనిపోయారు. ఢిల్లీలో మొత్తం బాధితుల సంఖ్య లక్షా 4 వేల 864కు చేరింది. 

 

మరోవైపు.. మహమ్మారిని కట్టడి చేయడానికి దేశంలోనే అనేక రాష్ట్రాలుల పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయ్‌. కేరళ తిరువనంతపురంలో కఠిన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కేసులు పెరుగుతుండటంతో సర్కార్‌ అప్రమత్తమైంది. బెంగళూరులో ప్రతి ఒక్క జోన్‌కి ఒక్క మంత్రిని ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అక్కడ శని, ఆదివారాల్లో పూర్తి లాక్‌డౌన్ విదిస్తోంది. పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం ఉత్తర పరగణ జిల్లాలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది.

 

కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో.. 72 గంటల లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది యూపీ సర్కారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. యూపీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా కట్టడి చేసిందని ప్రధాని కితాబిచ్చిన గంటల వ్యవధిలోనే లాక్ డౌన్ నిర్ణయం తీసుకుంది యోగి సర్కార్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: