వైసీపీలో అంతా బాగుంది అనిపించేంతలోగానే ఎక్కడో ఏదో మాటల తూటాలు పేలుతాయి. అవి ఒక్కోసారి ప్రతిపక్ష టీడీపీ సైతం అనలేని విధంగా ఉంటున్నాయి. చెప్పే విషయం మంచిదో చెడ్డదో కానీ పార్టీ అంతర్గత వేదికల మీద మాట్లాడకుండా రచ్చ చేసుకుంటే దాని వల్ల ఇబ్బంది అని అనుభవం కలిగిన నేతలకు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ వారు కావాలని చేస్తున్నారో లేక నిజంగా జనం కోసం మాట్లాడుతున్నామని అనుకుంటున్నారో తెలియదు కానీ వైసీపీని అడ్డంగా బుక్ చేసేస్తున్నారు.

 

శ్రీకాకుళానికి చెందిన ధర్మాన‌ ప్రసాదరావు ఇపుడు అలాంటి వ్యాఖ్యలతోనే పార్టీని ఇరుకున పెడుతున్నారు. ఆయన కూడా దాదాపుగా నాలుగు దశాబ్దాల పాటు అనుభవం కలిగిన నాయకుడు, మంత్రిగా ఎన్నో సార్లు పనిచేసి కీలకమైన శాఖలు చూశారు. ఇపుడు ధర్మాన కొత్త జిల్లా విషయం ప్రస్తావించారు.  పార్లమెంట్ ని ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు వస్తాయని ఆయన అంటున్నారు. నిజమే అవి ఉన్నాయి. 

 

అన్ని చోట్లా లేవు కానీ  కొన్ని చోట్ల చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఉదాహరణకు శ్రీకాకుళాన్ని పార్లమెంట్ ప్రాతిపదినక విభజన చేస్తే రాజాం, ఎచ్చెర్ల, పాలకొండ వంటివి విజయనగరం  జిల్లాలోకి పోయి కలుస్తాయి. దాని వల్ల అభివ్రుధ్ధి చెందిన ఈ ప్రాంతాలు కోల్పోయి మరింతగా శ్రీకాకుళం వెనకబాటు తనానికి గురి అవుతుంది.

 

ఈ సంగతి బాగానే ఉన్నా ధర్మాన వంటి వారు ఈ విషయాన్ని పార్టీ వేదికల మీద ప్రస్తావించినట్లైతే బాగుండేది, కానీ ఆయనే బాహాటంగా మాట్లాడ‌డం వల్ల విపక్షాల చేతికి ఒక ఆయుధాన్ని ఇస్తున్నట్లుగా ఉంది. ఇంతకు ముందు కూడా ధర్మాన వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఉందని కామెంట్స్ చేశారు. అయితే అది కొన్ని చోట్ల  అధికారుల స్థాయిలోనే  ఉందని ఆయన ఉద్దేశ్యం. దాన్ని ఆ తరువాత ఆయన‌ కవరింగ్ ఇచ్చినా జరగాల్సిన రాజకీయ నష్టం జరిగిపోయింది. మొత్తానికి ధర్మాన లాంటి వారితో వైసీపీకి ఇలా ఇబ్బందులు తరచూ వస్తున్నాయని వైసీపీలో చర్చ అయితే సాగుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: