రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడం ఎలా.. ఇది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. వైరస్‌ రూపురేఖలు నిర్ధారణ కానప్పటికీ లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు మనిషి ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు రెప్పవాల్చకుండా వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్‌ నేర్పుతున్న పాఠాల ఆధారంగా ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా వైద్యులు చికిత్సను అందిస్తూనే జాగ్రత్తలు సూచిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటించడంలో చూపిస్తున్న అలసత్వం వల్ల మహమ్మారి కొత్త లక్షణాలతో విరుచుకుపడుతున్నది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరిగిపోవడానికి దోహదం చేస్తున్నది. అపనమ్మకం ఆవహించిన వాళ్లు ఇప్పటికైనా మేల్కోవాలి. నివారణ చర్యలు పాటించాలి. అనవసరంగా తిరిగే బదులు చక్కగా ఇంటిపట్టున ఉండాలి. అవసరమైతేనే బయటికి రావాలి.

 

సర్కార్ ‌కూడా వైరస్‌ కట్టడికి అనుగుణంగానే నిబంధనలు జారీ చేస్తోంది. కట్టడికి ఒక పక్క వైద్యులు, మరో పక్క ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూనే ఉంది. కాని జనం ఏం చేస్తున్నారు. వైద్యుల సూచనలు పక్కన బెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ గాలిలో వైరస్‌తో పోటీపడుతున్నారు. ప్రమాదమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మాస్కులు, భౌతికదూరం, శుభ్రత పాటించకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఈ వైరస్‌ గాలిలోనే పుట్టి.. గాలిద్వారానే వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఓ నిర్ధారణకు రాగా.. ఇందుకు మాస్కు, భౌతికదూరం, శుభ్రత తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

 

 

కొత్తకొత్త లక్షణాలతో దోబూచులాడుతున్న మహమ్మారి దాటికి ప్రజలు విలవిలలాడుతున్నారు. ఏ స్థాయివారిని వదలడం లేదు. కొందరి నిర్లక్ష్యానికి పెద్ద సంఖ్యలో అమాయకులు బాధితులుగా మారుతున్నారు. నగరంలో కేసుల సంఖ్య పదులు, వందల నుంచి ఇప్పుడు వేలకు చేరుకున్నది. పరిస్థితులు అద్దం పడుతున్నా.. ఇంకా చాలామంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు విందులు.. వినోదాలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఎంత చెప్పినా ఎవరికీ చెవికెక్కడం లేదు. ఇలానే వైరస్‌ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మూడవ దశకు చేరుకునే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడవ దశకు చేరుకుంటే లోకల్‌ ట్రాన్సిమిషన్‌(స్థానికంగా వ్యాప్తి చెందడం)పెరగడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలుపుతున్నారు. వైరస్‌ బారినపడిన వారిలో ఎక్కువ శాతం త్వరగా కోలుకుంటున్నారు. కొందరికి సమయం పడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: