కాంగ్రెస్ వంద ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా కాంగ్రెస్ కి పేరు. ఈ దేశంలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్న వారంతా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. దేశానికి ఎందరో ప్రధానులు, ముఖ్యమంత్రులను అందించిన ఘనత కాంగ్రెస్ దే. ఈ దేశాన్ని అర్ధ శతాబ్దానికి పైగా పాలించిన కాంగ్రెస్ దేశానికి దశ, దిశను చూపించింది. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు కాంగ్రెస్ ఎన్నడూ లేనంత పెను సవాళ్లను ఎదుర్కోంటోంది.

 

ఇప్పటికిపుడు కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ ఎవరు అంటే చెప్పలేని స్థితిలో ఉంది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కి ఎపుడో  రాజీనామా చేశారు. సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉంటున్నారు. ఇక రాష్ట్రాల్లో  సరిగ్గా పీసీసీ కమిటీలు సరిగ్గా లేవు. మరో వైపు కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాలు తక్కువగా ఉంటే వాటిని కూడా లేపేసే పనిలో బీజేపీ పడింది.

 

నిన్న మధ్యప్రదేశ్ లో  ఏదైతే ప్రయోగం చేసి బీజేపీ  అధికారం అందుకుందో ఇపుడు రాజస్థాన్ లో కూడా అదే ప్రయోగం చేస్తోంది. సచిన్ పైలెట్ ని మచ్చిక చేసుకుని రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్ సర్కార్ని పడగొట్టాలని చూస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేలు 15 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేసి మరీ తనను మాజీని చేయాలని బీజేపీ చూస్తోందని అపుడే గెహ్లాట్ ఆరోపించారు.

 

అయితే ఆయనవి బేల ఏడుపులే కాబోతున్నాయి. బీజేపీ చాలా పటిష్టంగా కధ నడుపుతోంది. ఢిల్లీ దాకా తన ఎమ్మెల్యేలతో వచ్చేసిన సచిన్ పైలెట్ అన్ని అడుగులు జ్యోతిరాదిత్య సిందియా లాగానే వేస్తున్నారు. ఇపుడు బొటాబొటీ మెజారిటీతో ఉన్న గెహ్లాట్  సర్కార్  ఏ క్షణానైనా కూలడానికి సిధ్ధంగా ఉంది. ఈ విషయంలో బీజేపీ విజయం ఎంతో దూరంలో లేదు కూడా.

 

ఏడాదిన్నర క్రితం రెండు పెద్ద  రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను కాపాడుకోలేకపోవడం కాంగ్రెస్ స్వీయ తప్పిదం అని చెప్పాలి. ఆ పార్టీ అగ్ర నాయకత్వం ఇలా నాయకత్వ సవాళ్లతో ఇబ్బందులు పడుతూంటే ఇలాగే జరుగుతుంది. జ్యోతీరాదిత్య  తండ్రి మాధవ్ రావు సింధియా కానీ సచిన్ పైలెట్ తండ్రి రాజేష్ పైలెట్ కానీ కరడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు. తనయులు ఇలా బీజేపీ బాట పట్టడానికి కారణం మాత్రం కాంగ్రెసే. ఇవన్నీ చూస్తూటే 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింతగా బలహీనప‌డితే మరోమారు మోడీకి అవకాశం, అధికారం సోలోగా ఏలుకోమని రాసి ఇచ్చేసినట్లేనని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: