ప్రస్తుతం చైనా భారతదేశంపై ఆధిపత్యం సాధించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారత్కు ఎంతో సన్నిహితంగా  ఉన్న నేపాల్ ను  ఆర్థిక సహాయం పేరుతో తమ వైపు తిప్పుకుని  భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసే విధంగా చైనా ఎత్తులు వేసింది. ఇక తాజాగా భారత ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగా ఇరాన్ తో  కలిసి మరో ప్లాన్ కి సిద్ధమైంది చైనా . అమెరికా నిబంధనలతో పూర్తిగా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఇరాన్ ను  పెట్టుబడుల పేరుతో చైనా ఎర వేసి పూర్తిగా ఆ దేశాన్ని తమ వైపుకు తిప్పుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రయోజనాలకు విఘాతం ఏర్పడే పరిస్థితి ప్రస్తుతం తలెత్తింది. 

 


 గతంలో చాబర్  రైల్వే లైన్ ప్రాజెక్టు కోసం భారత్ ఇరాన్ మధ్య జరిగిన ఒప్పందం నుంచి భారత్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది ఇరాన్ .ఈ  ఒప్పందం జరిగి నాలుగేళ్ళు  గడుస్తున్నప్పటికీ ప్రాజెక్టు ప్రారంభానికి భారత్ ఇంకా నిధులు  ఇవ్వడం లేదంటూ ఆరోపించిన ఇరాన్... తామే ఈ రైలు మార్గాన్ని సొంతంగా నిర్మించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. అయితే 2016లో ప్రధాని మోదీ టెహ్రాన్ పర్యటన సందర్భంగా చాబర్ రైల్వే లైన్ ఒప్పందం కుదిరింది. ఇరాన్  అధ్యక్షుడితో పాటు ఆఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు కూడా ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ముఖ్యంగా పాకిస్తాన్ ను  తప్పించడం అనే ఉద్దేశంతోనే భారత్ ఈ త్రైపాక్షిక ఒప్పందానికి మొగ్గు చూపింది. 

 

 ఇక వివిధ కారణాల దృష్ట్యా భారత ఇంజనీర్లు ఇరాన్లో రైల్వేలైన్ నిర్మాణం గురించి పర్యటించినప్పటికీ..  ఇప్పటివరకు కార్యాచరణ చేపట్టలేదు. ఈ క్రమంలోనే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్కు పెట్టుబడుల ఎర చూపింది చైనా . నౌకాశ్రయాలు,  రైల్వేలు ఇలా ఇరాన్ లోని పలు విభాగాల్లో చైనా పెట్టుబడి పెట్టడంతో పాటు అతి తక్కువ ధరలకే ఇంధనం అందజేస్తామని చెప్పి మద్దతు ఇరాన్ కు  పలుకుతున్నట్లుగా నాటకాలు ఆడి ఇరాన్  దేశాన్ని తమ వైపుకు తిప్పుకుంది. తద్వారా ఈ ప్రాంతంలో కూడా చైనా బలగాలు మోహరించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే చాబర్  రైల్వే లైన్ ప్రాజెక్టు నుంచి ఇరాన్  భారత్ ను తొలగించడంతో ప్రస్తుతం భారత ప్రయోజనాలకు విఘాతం కలిగింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: