తెలంగాణ సచివాలయ భవనాల కూల్చివేత అంశంపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అదనపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. భవనాల కూల్చివేతకు జీహెచ్ ఎంసీతో పాటు అన్ని అనుమతులూ తీసుకున్నామని ఏజీ కోర్టుకు తెలిపారు.   సచివాలయంలో 11 బ్లాకులు ఉన్నాయని, ఇందులో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విచారణ వాయిదా పడడంతో భవనాల కూల్చివేతపై రేపటి వరకు స్టే కొనసాగనుంది.  

 

తెలంగాణ స‌చివాల‌య భ‌వ‌నాల కూల్చివేత‌పై స్టే కొన‌సాగుతూనే ఉంది.  ఈ అంశంలో అడిషనల్‌ రిపోర్టు సమర్పించాలని   హైకోర్టు పిటిషనర్‌ను కోరింది.  భవనాల కూల్చివేతకు రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్‌ అనుమతి అవసరం లేదని పలు తీర్పులు ఉన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తామని ప్రభుత్వ తరపు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు పిటిషనర్‌ రిప్లై దాఖలు చేశారు. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం-2018కి విరుద్ధంగా కూల్చివేత పనులు చేపడుతున్నారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఒక ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌ తీసుకోవాలని పిటిషనర్‌ తెలుపగా, లీగల్‌ రిజర్వ్‌మెంట్స్‌పై వివరణ ఇవ్వాలని కోర్టు పిటిషనర్‌ను కోరింది. పర్యావరణ పరిరక్షణ సవరణ చట్టం ఏం చెపుతుందో తెలపాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది.

 

భవనాల కూల్చివేతకు కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోలేదని పిటిషనర్‌ పేర్కొనగా, ఒక ప్రాజెక్టు నిర్మించడానికి మాత్రమే కేంద్ర మంత్రిత్వశాఖ అనుమతి అవసరమని అడ్వొకేట్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం భవనాల కూల్చివేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ అనుమతి తీసుకోవాలని హైకోర్టు తెలిపింది.  ఇప్పుడు తాము ఎలాంటి నిర్మాణం చేపట్టడం లేదని, నూతన నిర్మాణాలు చేపట్టేటప్పుడు అన్ని అనుమతులు తీసుకుంటాని హైకోర్టుకు వివరించారు ఏజీ. జీహెచ్ఎంసీ, స్థానిక అధికారులు, పర్యావరణ నియంత్రణ మండలి అనుమతులు తీసుకున్నామని చెప్పారు.  కాగా సోలిసిటర్ జనరల్ రేపు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

 

పర్యావరణ అనుమతిపై రేపు కేంద్రం వివరణ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూర్చే తీర్పులుంటే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. సచివాలయం కూల్చివేతకు సంబంధించి మంత్రివర్గ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు హైకోర్టుకు సమర్పించింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణ రేపటికి వాయిదా వేసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: