కరోనా వైరస్ ప్రభావం ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో విజృంభించిందో అప్పటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదో ఒక రూపంలో వరుసగా చిక్కులు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా ను కట్టడి చేయడంలో విఫలం అవుతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. అలాగే పరీక్షలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలతో పాటు, కోర్టులు కూడా మొట్టికాయలు వేశాయి. ఇప్పటికీ ఈ విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ వస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా తెలంగాణ సచివాలయం కూల్చివేత విషయంలోనూ, ఇదే రకమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఈ విషయంలో నానా హంగామా చేస్తూ వస్తోంది. సచివాలయంలోని జి బ్లాక్ కింద గుప్తనిధులు ఉన్నాయంటూ రేవంత్ రెడ్డి వంటివారు సంచలన విషయాలు బయట పెట్టారు. 

IHG


ఈ వ్యవహారం ఇలా ఉండగానే, సచివాలయ భవనం కూల్చివేతకు సంబంధించి పర్యావరణ అనుమతుల విషయం లో హైకోర్టు లో ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా ఈ కూల్చివేతలు పర్యావరణ అనుమతి అవసరం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించడంతో, పిటిషనర్ తరపు న్యాయవాది పర్యావరణ అనుమతులు అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ప్రభుత్వం ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే కూల్చివేతకు సిద్ధపడింది అని చెప్పడంతో కూల్చివేతకు పర్యావరణ అనుమతి అవసరం లేదంటూ అడ్వకేట్ జనరల్ సమాధానం ఇచ్చారు. దీనిపై హైకోర్టు నిర్మాణానికి భూమిని సిద్ధం చేసేందుకు తప్పనిసరిగా పర్యావరణ అనుమతి అవసరం అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.

 

IHG


 ప్రస్తుతం కూల్చేస్తున్న సెక్రటరియేట్ స్థానంలో మరో కొత్త సెక్రటరియేట్ నిర్మించబోతున్నారు కాబట్టి, తప్పనిసరిగా పర్యావరణ అనుమతులు ఉండాల్సిందేనని అభిప్రాయపడింది. అంతేకాకుండా పర్యావరణ అనుమతుల విషయంపై వివరణ  ఇవ్వాలంటూ కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని, ప్రభుత్వ న్యాయవాది చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ గతంలో ఇటువంటి విషయాల్లో కోర్టు తీర్పు ఏదైనా మీ వద్ద ఉంటే వాటిని సమర్పించాలని ఆదేశించింది. దీనిపై రేపటి వరకు స్టే కొనసాగుతుందని హైకోర్టు తెలిపింది. అసలే బిజెపి టీఆర్ఎస్ మధ్య ఉప్పు నిప్పులా పరిస్థితి ఉన్న సమయంలో ఈ వ్యవహారాన్ని కోర్టు కేంద్రం చేతిలో పెట్టడంతో, కేంద్రం ఏ విధమైన సమాధానం కోర్టుకు ఇస్తుందనే టెన్షన్ టిఆర్ఎస్ లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: