కంటికి కనిపించని వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో న‌గ‌రాల‌ను, ప‌ట్ట‌ణాల‌ను న‌మ్ముకున్న వారి ప‌రిస్థితి ఆందోళ‌నకరంగా మారింది.  ఓ వైపు పనులు లేక, మరో వైపు జీవితం భార‌మైన నేప‌థ్యంలో పట్నంలో ఏమున్నది.. నా ఊర్లో నేను బతికుంటే బలసాకు తినొచ్చు అనుకున్న అడ్డా కూలీలు, ఇత‌ర వ‌ర్గాల వారు సొంత ఊర్లకు పరుగులు పెట్టారు. వర్షాకాలంలో వ్య‌వ‌సాయ ప‌నులు మొద‌లు కావ‌డంతో  హైద‌రాబాద్ సిటీని వ‌దిలిపెట్టి స్వ‌గ్రామాల‌కు, ఊర్ల‌కు అంతా బాట పట్టారు. వ్య‌వ‌సాయ ప‌నుల‌కు కూలీగా వెళుతున్నారు. దీంతో ఊళ్ల‌ల్లో కూలీల కొర‌త త‌ప్పింది.

 

 

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో నగరానికి బతకు దెరువు కోసం వచ్చిన కూలీలకు ఉపాధి దొర‌క‌లేదు. క‌రోనా ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కూదేలవుతుంటే భవన నిర్మాణ కార్మికులు, అడ్డా కూలీలకు సైతం ఇబ్బంది ఎదురైంది. దీంతో  నగరానికి బతకు దెరువు కోసం వచ్చిన కార్మికులు పెద్ద ఎత్తున సొంత ఊర్లకు వెళ్లిపోయారు. మరో వైపు వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించటంతో సొంత ఊరిలో పొలం పని చేసుకుంటూ బతుకొచ్చని మరికొందరు వెళ్లిపోయారు. ఇప్పటికే కార్మికులు లేక కొందరు బిల్డర్లు వారి నిర్మాణాలను నిలిపివేయటంతో మరికొందరు ఉన్న లేబర్‌తోనే నెట్టుకొస్తున్నారు. ఇంటి నిర్మాణ పనుల కోసం అడ్డాకూలీల వద్దకు వెళితే కూలీలు దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. 

 

ఇదిలాఉండ‌గా, కొవిడ్‌-19 వైరస్‌ ఉందా..? లేదా..? అని తెలుసుకునేందుకు హైద‌రాబాద్ పరిధిలోని ప‌లు ప్రాంతాల్లో ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు చేస్తుండటంతో ప్రజలు అక్క‌డికి పోటెత్తుతున్నారు. కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి గతంలో రోజుల తరబడి నిరీక్షించిన  ప్రజలు ర్యాపిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలతో ఉపశమనం పొందుతున్నారు. శాంపిల్స్‌ కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా కేవలం అర గంటలోపే కరోనా పాజిటివ్‌ ఉందో.. లేదో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: