తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌కు సెంటిమెంట్ల రాజ‌కీయాలు చేయ‌డంలో ఒక‌రికొక‌రు తీసిపోరు. ఒక‌వైపు సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయాలపై యుద్దం చేయాలంటున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. మ‌రోవైపు విభజనలో మనకు జరిగిన నష్టాలపై రాష్ట్రంలో గ్రామ, గ్రామాన ప్రజలకు తెలియచెప్పాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాదిస్తున్నాడు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు తమ అనుభవంతో రాష్ట్రాలను అభివృద్ది చేస్తామని ఎన్నికలలో హామీలు, వాగ్దానాలు గుప్పించారు. ఇప్పుడు ఒకాయన సమైక్య రాష్ట్రంలో అన్యాయాల గురించి చెప్పాలని అంటున్నారు. మరొకాయన విభజన అన్యాయాలను వివరిద్దాం అని అంటున్నారు.కానీ ప్ర‌స్తుత ప‌రిస్థిత్తుల్లో రాష్ట్రా అభివృధ్ధికి పాత‌ర వేశారు. 


సమైక్య రాష్ట్రంలో ఏమి అన్యాయం జరిగిందంటే


అంటే వీరిద్దరూ సెంటిమెంట్‌ రాజకీయాలతో ప్రజలను ఆ మత్తులోనే ఉంచాలని చూస్తున్నారని అనుకోవాలా..? లేదా రాష్ట్రంలో ఉన్న సమస్యలకు, తాము చేయలేకపోతున్న అనేక పనులకు అవే కారణాలను సాకుగా చూపాలని అనుకుంటున్నారా..?  సమైక్య రాష్ట్రంలో ఏమి అన్యాయం జరిగిందంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన వాక్చాతుర్యం తో ఎన్ని గంటలైనా మాట్లాడగలరు. నిజంగానే సమైక్య రాష్ట్రంలో అంత అన్యాయం జరిగితే కేసీఆర్‌ చెబుతున్నట్లుగా తెలంగాణ ధనిక రాష్ట్రం ఎలా అయిందంటే, అసలు మా రాష్ట్రం ఇంకా ఎక్కువ ధనవంతంగా ఉండేదని అంటారు. హైదరాబాద్‌ అభివృద్ది ఎప్పుడో నిజాం నాడే జరిగిందని అంటారు. నిజాం నాడు ప్రజలకు ఏమి సదుపాయాలు ఉన్నాయి? విద్యుత్‌ లేదు. బహుశా పలుకు బడికలిగిన కొందరికి కరెంటు ఇచ్చారేమో! 


పోచంపాడు, మానేరు, జూరాల, ఎస్‌ఎల్‌ బిసి వంటి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ లు వ‌చ్చినా ఆచ‌ర‌ణ‌కు నోచుకోలేద‌న్న‌ది జ‌గ‌మేరిగిన స‌త్యం. కానీ సమైక్య రాష్ట్రంలో ఏమీ జరగలేదని చెప్పడం ద్వారా ప్రజలను ఆంధ్ర వ్యతిరేక భావనలోనే ఉంచాలన్న తాపత్రయం కనబడుతుంది. హైదరాబాద్‌ నగరం అభివృద్ది అంతా ఈ ఏడాదిలోనే జరిగిందా? అలా అని సమస్యలు లేవని కాదు. కెసిఆర్‌ చెప్పినట్లు ఇక్కడ రోడ్లపై నీళ్లు నిలబడుతుండవచ్చు. డ్రైనేజీ సమస్యలు ఉండవచ్చు. కాని అవే కాదు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, అనేక యూని వర్శీటీ లు, లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఐటి పరిశ్రమ, విదేశాలలో ఉన్నామా అన్నంతగా తయారైన ఫైనాన్షియల్‌ సిటీ వంటివి సమైక్య రాష్ట్రంలోనే వచ్చాయన్న సంగతిని ఆయన మరుగున పెట్టాలనుకుంటున్నారు. 


కేసీఆర్‌ ఇలాగే సమైక్య రాష్ట్ర సమస్యలు అంటూ చెప్పుకుంటూ


చరిత్ర ఏ ఒక్కరి సొంతమో కాదు. చరిత్రలో రెండో కోణం నుంచి కూడా జనం ఎప్పుడో అప్పుడు ఆలోచిస్తారు. కేసీఆర్‌ ఇలాగే సమైక్య రాష్ట్ర సమస్యలు అంటూ చెప్పుకుంటూ పోతే జనం ఆయనను విశ్వసించని పరిస్థితి వస్తుందని చెప్పడానికే ఈ యత్నం జ‌రుగుతుంది. ఇంకా ఆ పరిస్థితి రాలేదు. కేసీఆర్‌ కొన్ని వాగ్దానాలను అమలు చేయ పోయినా, కొంత చిత్తశుద్ది ఉంది అని, కమిట్‌మెంట్‌ ఉందని జనం అనుకుంటున్నారు. ఆయన దానిని నిలబెట్టుకోగలిగితే అప్పుడు మరోసారి విజయం సాధించగలుగుతారు. నాలుగేళ్ల తర్వాత కూడా సమైక్య రాష్ట్ర అన్యాయాలు అంటే మాత్రం జనం ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటారన్నది ప్రశ్నార్ధకమే. 


ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వరస చూద్దాం.. మొత్తం అభివృద్ది అంతా తన హాయంలోనే జరిగిందని చెబుతారు. సైబరాబాద్‌ తానే నిర్మించానని చెప్పుకుంటారు. హైదరాబాద్‌ ను అభివృద్ది చేసి చూపించానని అంటారు. ఆయన హైదరాబాద్‌ పై అధికారానికి దూరమై పదకోండేళ్లు అవుతున్నా, ఈ మధ్యలో ఏమీ జరగలేదని జనం నమ్మాలని ఆయన కోరిక. హైదరాబాద్‌ ను అభివృద్ది చేశానని చెప్పే చంద్రబాబు మరి తొమ్మిదేళ్లలో సీమాంద్రలో ఏమి చేయలేదని చెప్పుకుంటారా..?  ఆ మాట నేరుగా అనరు. విభజిత ఏపీని తానైతేనే అభివృద్ధి చేయగలు గుతానని, మరెవ్వరి వల్ల కాదని జనాన్ని ఎన్నికల ముందు నమ్మించారు. కాని ఇప్పుడు మాట్లాడితే అన్నీ కష్టాలే ఏకరువు పెడుతుంటారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని పదే పదే చెబుతారు. అయినా వేల కోట్ల రుణమాఫీ చేశానని చెబుతుంటారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏపీ ప్రజల సొమ్ము కాదా? ఈ ఏడాదిలోనే చంద్రబాబు అన్ని వేల కోట్ల రూపాయలు సృష్టించారా? ఏమైనా చెప్పగలరు. 


కాంగ్రెస్‌ పాపాల వల్లే డిపాజిట్లు కోల్పోయిందని


కాంగ్రెస్‌ పాపాల వల్లే డిపాజిట్లు కోల్పోయిందని అంటారు. విభజన హేతుబద్దంగా జరగలేదని అంటారు. తాను ఎప్పుడో ఈ విషయం చెప్పానని అంటారు. అ సమన్యాయం ఏమిటో, హేతుబద్దత ఏమిటో ఇంతవరకు చెప్పలేదు. హైదరాబాద్‌ లేని ఏపీ ఇచ్చారని అంటారు. హైదరాబాద్‌ మాదిరి ఒక నగరాన్ని అభివృద్ది చేసి ఇవ్వాలని, ఆ తర్వాతే తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని ఎన్నడైనా చెప్పారా.. అంటే దానికి సమాధానం ఉండదు. నిజంగానే ఏపీ అంత అధ్వాన్నంగా ఉందా? విభజన వల్లే మొత్తం నాశనం అవుతుందా? లేక రాజకీయ పార్టీలు ఇష్టారాజ్యంగా చేసిన వాగ్దానాల వల్ల నష్టపోతున్నదా? నిజం గానే ఏపీ అన్ని సమస్యలలో ఉంటే ఇరవైనాలుగువేల కోట్ల రూపాయలను రైతు రుణమాఫీకి ఎలా ఇవ్వగలుగుతున్నారు? మరో నాలుగు వేల కోట్ల డ్వాక్రా రుణాలకు, పారిశ్రామిక సబ్సిడీల కింద రెండువేల కోట్లు, సంక్రాంతి కానుక పేరుతో 350కోట్లు ఎలా ఖర్చు చేయగలిగారు? ఉద్యోగులకు జీతాల కింద తొమ్మిదివేల కోట్లు ఎలా పెంచగలిగారు? ఇదంతా ఎవరూ సొంత ఆస్తుల నుంచి ఇవ్వరు కదా? ప్రజల నుంచి వసూలు అయ్యే పన్నుల నుంచే కదా? 


ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొంత భారం


పెట్రోలు, డీజిల్‌ పై నాలుగు రూపాయల పన్ను భారం గురించి మాత్రం చెప్పరు. విద్యుత్‌ చార్జీల పెంపు గురించి మాట్లాడారు. ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొంత భారం వేయవలసి రావచ్చు. అది తప్పు కాదు. కాని ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని రుణాల మాఫీ పేర వేల కోట్లు ఖర్చు చేస్తూ , రాష్ట్రం ఆర్ధికంగా కష్టాలలో ఉందని చెప్పడమే బాధాకరం. అవన్ని విభజన సమస్యలని ప్రచారం చేయడం కేవలం ప్రజలను మభ్య పెట్టడమే. ప్రాధాన్యత ఇవ్వవలసిన పోలవరం వంటి ప్రాజెక్టులను పక్కనబెట్టి రుణమాఫీ వంటి ప్రజాకర్షణ పధకాలకు చంద్రబాబు వంటి సంస్కరణవాధులు వచ్చే పరిస్థితి ప్రజాస్వామ్యానికి మంచిదా అంటే ఏమి చెబుదాం. ఎవరి రాజకీయం వారిది. అధికారం కోసం ఏమైనా చేయాలి కదా అంటారు. సమైక్య సమస్యలని కెసిఆర్‌ అన్నా, విభజన సమస్యలని చంద్రబాబు అన్నా ఎంతకాలం జనం నమ్ముతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: