మామూలుగా అయితే.. పాతబస్తీలో కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వరకు మాత్రమే పరిమితంగా ఇన్నాళ్లూ కనిపించిన ఎంఐఎం పార్టీని రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఇటీవలి కాలంలో ప్రయత్నాలు పెరిగాయి. గత ఎన్నికల్లో నిజమాబాద్‌లో కూడా ఉనికి చాటుకున్న ఎంఐఎం.. ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తలపడింది. తమ అస్తిత్వాన్ని కనబరచే ప్రయత్నం చేసింది. అయితే ప్రస్తుతం బీహార్‌ ఎన్నికల్లో కూడా బరిలోకి దిగడానికి ఎంఐఎం సిద్ధపడుతూ ఉండడంతో అక్కడి సమీకరణాల్లో మార్పు వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 


బీహార్‌ ఎన్నికల్లో ప్రత్యేకించి సీమాంచల్‌ ప్రాంతంలో తాము బరిలో ఉంటాం అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 37 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఎంఐఎం గనుక బరిలో ఉంటే.. దానివలన భాజపా వ్యతిరేక కూటమికి చెప్పలేనంత నష్టం జరుగుతుందని అందరూ అంచనా వేస్తున్నారు. భాజపాకు వ్యతిరేకంగా.. నితీశ్‌, లాలూ, కాంగ్రెస్‌ పార్టీలు కలసి బరిలో ఉన్నాయి. ముస్లిం ఓట్లన్నీ తమతోను అనుకుంటుండగా.. ములాయం విడిగా పోటీలో ఉంటే.. కాస్త దెబ్బే అని ఇప్పటికే భయపడుతున్నారు. 


దానికి తోడు ఎంఐఎం కూడా పోటీలో ఉన్నదంటే గనుక ముస్లింఓట్లలో చీలిక విపరీతంగా వస్తుంది. మహాకూటమికి, భాజపా కూటమికి మధ్య ఎన్నికలు పోటాపోటీగా నడుస్తాయని అనుకుంటున్న తరుణంలో.. కొన్ని ఓట్ల చీలిక కూడా విజయాలపై గణనీయంగా ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు. ఎంఐఎం పోటీచేస్తే గనుక.. భాజపా కూటమికి డబుల్‌ హ్యాపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ కూటమి మరో రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడానికి తమ వంతుగా చేయూత అందించడం తప్ప ఎంఐఎం పోటీ వల్ల పెద్దగా ఏమీ ఒరగదని పలువురు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: