విశాఖ ఎంపీ సీటు ఇపుడు కమ్మకమ్మ‌గా ఉంది. ఈ కమ్మదనం ఎవరికి ఆనందాన్నిస్తుందో చూడాలి. ఏపీలో అనేక ఎంపీ సీట్లు ఉన్నాయి. ఐతే దేనికీ లేని ప్రత్యేకతలు విశాఖ ఎంపీ సీటుకు ఉన్నాయి. ఇక్కడ అంతా వలస పక్షులది రాజ్యం. అంతే కాదు ఒకే సామజిక వర్గం పెత్తనం కూడా ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. జనాభా పరంగా చూసినా లోకల్ గా చూసినా వారి సంఖ్య బహు పరిమితం. కానీ లక్షల ఓటర్లకు ప్రాతినిధ్యం వహించే విశాఖ సీటుని మాత్రం ఎటువంటి ఆయాసం లేకుండా ఎగరేసుకుపోతున్నారు.


విశాఖ లోక్ సభ సీటు మూడు దశాబ్దాలుగా పరాయి జిల్లాల పరమైన సంగతి విధితమే.  1989  తరువాత ఇప్పటికి  తొమ్మిది  సార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు ఒకే సామాజిక వర్గం ఇక్కడ గెలిచింది. అంతే కాదు మొత్తం ముప్పయ్యేళ్ళ పాలనలో ఇర్వయ్యేళ్ళు వారే ఎంపీలుగా ఉండడం విశేషం. మధ్యంతర ఎన్నికలు, ఇతర కారణాల వల్ల మిగిలిన పదేళ్ళను తక్కిన సామాజిక వర్గాల వారు సర్దుకోవాల్సివచ్చింది. 1989 ఎన్నికల్లో కేరళకు చెందిన అయ్యంగార్ కుటుంబానికి చెందిన ఉమాగజపతి రాజు ఎంపీ అయ్యారు. ఆ తరువాత 1996, 1998 లలొ రెండు సార్లు  నెల్లూరుకు చెందిన  టి సుబ్బరామిరెడ్డి ఎంపీ అయ్యారు. 2004 ఎన్నికల్లో నెల్లూరుకు చెందిన నేదురుమల్లి జనార్ధనరెడ్డి ఎంపీ అయ్యారు. ఇలా కమ్మేతర కులాలు మొత్తం పదేళ్ళ పాలన‌ పంచుకున్నాయి.


ఇక కమ్మ వారి విషయానికి వస్తే 1991, 1999 ఎన్నికల్లో రెండు మార్లు పదేళ్ళ పాటు దివంగత ఎంవీవీఎస్ మూర్తి విశాఖ ఎంపీగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు అయిదేళ్ల పాటు కమ్మ కులానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి, 2014 నుంచి ఇప్పటి వరకూ అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు విశాఖ ఎంపీలుగా ఉన్నారు. ఇలా ఒకే సామజిక వర్గం అధిక పర్యాయాలు ఇక్కడ గెలవడం ఎక్కువ కాలం ఎంపీలుగా ఉండడం ఒక్క విశాఖనే  చెల్లు అనిపిస్తోంది.


విజయవాడ తరువాత కమ్మ కులస్తులు విశాఖ ఎంపీ సీటును వారి సొంతం చేసుకున్నారని అనిపిస్తోంది. ఎందుకంటే ప్రతీ ఎన్నికకూ ప్రత్యేకించి టీడీపీ తమ అభ్యర్ధిగా సొంత సామాజిక వర్గాన్నే పోటీలో పెడుతోంది. ఇక బీజేపీ కూడా ఆ వరసలోనే ప్రతీ ఎన్నికకూ కమ్మ వారినే  ఎంపీ అభ్యర్ధులుగా చేస్తోంది. ఇపుడు వైసీపీ కూడా ఈ ఎన్నికల్లో కమ్మవారికే టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున ఈసారి  బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి మూర్తి మనవడు శ్రీ భరత్ రంగంలో ఉంటే, బీజేపీ పురంధేశ్వరికి టికెట్ ఇచ్చింది. 


ఈ పరిణామాలను బేరీజు వేసుకున్నపుడు విశాఖ జనాభా పరంగా కమ్మలు ఉన్నది ఎంత అన్న ప్రశ్న వస్తుంది. విశాఖ ఎంపీ సీటు పరిధిలో బ్రాహ్మణులు, యాదవులు, కాపులు, బీసీలు, ముస్లిములు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కమ్మ వారు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అలాగే రెడ్లు కూడా పరిమిత శాతమే. మరి. ఇలా . మిగిలిన వారంతా స్థానికులు కాగా, కమ్మలు, రెడ్లు వలస వచ్చారు. మరి అన్ని పార్టీలు వారినే అభ్యర్ధులుగా పెట్టడం అంటే విశాఖ పట్ల ఆ కమ్మదనం ఏంటన్నది అర్ధం కావడం లేదని అంటున్నారు. పైగా వలస పక్షులను తీసుకువచ్చి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈసారి చూస్తే అంతా దిగుమతి సరుకే ఎంపీ పోటీలో ఉంది. ఈ పరిణామాలను విశాఖ వాసులు, స్థానికులు తట్టుకోలేకపోతున్నారు, కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ విధానాల్లో మార్పు చేసుకోవడంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: