దేశ‌వ్యాప్తంగా కౌంటింగ్ ఉత్కంఠ కొన‌సాగుతోంది. అయితే, స‌రిహ‌ద్దు రాష్ట్రమైన జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆ సంద‌డి నామమాత్ర‌మే. ఎందుకంటే..జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదు. కేవలం లోక్‌ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఐదు దశల్లో లోక్‌ సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. కాగా ఉగ్రవాద ఘటనలు, ఇండో పాక్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు జాప్యం జరుగుతాయని భావించారు. అయితే, కొన్ని ఘ‌ట‌న‌లు మిన‌హా పోలింగ్ జ‌రిగింది.


రాష్ట్ర అసెంబ్లీ రద్దవడంతో ఆరు నెలల్లోగా అసెంబ్లీకి తాజా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ అక్కడున్న సమస్యాత్మక పరిస్థితుల్లో సాధ్యం కాదని ఈసీ భావించింది. జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం పట్ల కేంద్రం నియమించిన గవర్నర్‌ సైతం విముఖత చూపినట్టు తెలిసింది. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ గడువు 2021, మార్చి 16 వరకూ ఉన్నా పాలక పీడీపీ-బీజేపీ సర్కార్‌ పతనమవడంతో అసెంబ్లీ రద్దయిన సంగతి తెలిసిందే.


కాగా, ఎన్నిక‌లు నిర్వ‌హించ‌క‌పోవ‌డంపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సెటైర్లు వేశారు. ``1996 తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదు. ప్రధాని మోదీ శక్తిమంతమైన నాయకత్వాన్ని ప్రశంసించే మీకు ఇది గుర్తుండి పోతుంది.`` అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నిక‌లు నిర్వ‌హించిన స్థానాల‌కు నేడు ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: