2019 సార్వత్రిక ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన సినీ ప్రేక్షకులు.  వినటానికి విడ్డూరంగా వున్నా ఈ విశ్లేషణ చూస్తే కొంతమేర ఇది అక్షరసత్యమనే అనిపిస్తుంది.  ఎన్నికల ప్రచారానికి కాదేదీ అనర్హం అనడానికి ఈ మధ్యనే జరిగిన ఎన్నికలే సాక్ష్యం. ఎన్నికల ప్రచారానికి డబ్బు, మద్యం లాంటివి విరివిగా వాడుతుంటారు, కాని అంతకుమించి సినిమా అన్న ఆయుధాన్ని చాలా పకడ్బందీగా వాడి విజయం సాధించారు మన మోడీగారు.  ఎవ్వరికీ అర్ధం కాని ఈ మాస్టర్ ప్లాన్ చాప కింద నీరులా మౌడీవేవ్ ను తీసకువచ్చి సినీ ప్రేక్షకులలో స్ఫూర్తిని నింపి కొంత మేర ఓటింగ్ శాతం సైతం పెరిగేలా చేసింది.   అది ఎలాగో ఓసారి చూద్దాం.


గడిచిన ఎన్నికల ముందు 4 నెలల వ్యవధిలో 3 సినిమాలు విడుదలయ్యాయి.  ‘ఊరి ది సర్జికల్ స్ట్రైక్’ (11 జనవరి విడుదలైంది), ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మనిస్టర్’ (18 జనవరిన విడుదలైంది) మరియు ‘ది థాష్కెంట్ ఫైల్స్’ (12 ఏప్రిల్ న విడుదలైంది).  మొదటిది పాకిస్తాన్ పై మన సైనిక దాడుల ఇతివృత్తమైతే మిగతా రెండూ యదార్ధ రాజకీయ సంఘటనల నేపధ్యం కలిగినవే.  ‘ఊరి’ సినిమా లో పాకిస్తాన్ పై మన సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ తో సినీ ప్రేక్షకులలో మోడి ప్రభుత్వంపై భారీ భరోసా కలిగించింది. ఇది మోడి ఓటర్లపై విసిరిన మొదటి సినిమా ప్రచారం. ఓ వారం గ్యాప్ లో ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మనిస్టర్’ సినిమాని రిలీజ్ చేశారు.  ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మనిస్టర్’ సినిమా కథను గమనిస్తే... మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అవడం, ఆ పై జరిగిన పరిణామాలతో పదవికి రాజీనామా చేయడం.  


పాయింట్ సింపుల్ గా వున్నా, కథలో కాంగ్రెస్ పార్టీ మరియు సోనియాగాంధీ పై చిత్రీకరించిన విధానం చూస్తే సామాన్య ప్రేక్షకుడికి  సైతం చాలా వరకు ఆ పార్టీ పై వ్యతిరేకతా భావం చేకూరుతుంది.  ఇది మోడి వేసిన రెండో సినిమా ప్రచారాస్త్రం.  పైగా ఈ సినిమా రిలీజ్ అయిపుడు ఎన్నికల ప్రకటనగాని, కోడ్ గాని లేకపోవడం విశేషం.  ఇక ఆఖరి అస్త్రం ‘ది థాష్కెంట్ ఫైల్స్’ సినిమా.  ఈ సినిమా విడుదల సమయానికి మొదటి విడత ఎన్నికలు పూర్తయ్యాయి. అంటే అసలైన ఎన్నికలు ఈ సినిమా విడుదల తరువాతే ప్రారంభమయ్యాయి. మొదట ఈ సినిమాకు అంతగా ఆదరణ లేకున్నా నేటికీ ఈ సినిమా ధియేటర్లలో ఆడుతూండడం విశేషం. 


ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి మరణం పై నెలకొన్న వివాదం తాలూకు ఇతివృత్తం ఇది.  పై రెండు సినిమాలకన్నా ఈ సినిమా ప్రేక్షకుడిని ప్రభావితం చేయడానికి ఎంతో దోహదపడింది.  ఎందుకంటే సినిమాలో ఇందిరాగాంధీ దేశానికి చేసిన కుట్రను సవివరంగా వివరించారు. ఆ కుట్రలో భాగంగానే లాల్ బహుదూర్ శాస్త్రి అకాల మరణం వెనుక దాగున్న రహస్యాలు ఈ రోజుకీ ప్రపంచానికి తెలియరానీయలేదు. కథాంశాన్ని చాలా లోతుగా విశ్లేషించి సాక్ష్యాధారాలతో చూపించారీ చిత్రంలో.


చిత్రం చూసిన ప్రతి ప్రేక్షకుడికి గాంధీ కుటుంబంపై మరియు కాంగ్రెస్ పార్టీ పై ద్వేషపూరితమైన భావన కలుగుతుంది.  విచిత్రం ఏమిటంటే ఈ ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మనిస్టర్’ మరియు ‘ది థాష్కెంట్ ఫైల్స్’ సినిమాల్లో కథలను ప్రేక్షకులకు మీడియా రిపోర్టర్లు వివరించి నడిపిస్తారు.  ఇక విడుదల కాని సినిమా ఏదైనా ఉందంటే అది మోడీ ఎన్నికల ప్రచారం కోసమే తీసిన సినిమా ‘నరేంద్రమోడీ’.  నిజానికి ప్రచారం కోసమే తీసిన ఈ సినిమా ఎన్నికల కోడ్ ఉల్లంఘనతో విడుదలకు కూడా నోచుకోలేదు.


 సాధనం ఏదైనా ప్రచార శైలి మాత్రం ఈ సినిమాల్లో ఎంతోకొంత ఇమిడివుంది.  ఎందుకంటే సినిమా అన్నది సామాన్యుడిని సైతం మార్చగల అత్యుత్తమ సాధనం.ఆఖరుగా ఒక్క మాట ఈ సినిమాలన్నీ మోడీ లేదా బీజేపి పార్టీ  దగ్గరుండి తీయించారా అంటే కానే కాదు, కాని ఈ సినిమాలన్నీ విడుదలైన సమయం మరియు సందర్భాన్ని బట్టి మోడీ ప్రచారానికి గట్టిగా ఉపయోగపడ్డాయనే నా ఉద్దేశం.  


మరింత సమాచారం తెలుసుకోండి: