తెలుగుదేశంపార్టీకి సమాధి కట్టేందుకు బిజెపి పెద్ద వ్యూహాన్నే అమలు చేయబోతున్నట్లు సమాచారం. 13 జిల్లాల్లోను టిడిపి అతలాకుతలం చేయటం ద్వారా చంద్రబాబునాయుడుకు ఎలాగైనా చుక్కలు చూపించాలన్న ఉద్దశ్యంతోనే ఢిల్లీ నేతలు పెద్ద స్కెచ్చే వేశారని సమాచారం.  ఆ స్కెచ్ కూడా రెండు రకాలుగా ఉండబోతోందట.

 

మొన్నటి ఎన్నికల్లో ఎంఎల్ఏలుగా గెలిచిన వారిలో వీలైనంత మందిని లాగేసుకోవటం మొదటిది. నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఆకర్షించి బిజెపిలో చేర్చుకోవటం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇవ్వటం రెండోది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్రస్ధాయిలోని నేతల ద్వారా కాకుండా ఢిల్లీలోని ముఖ్యుల చేతుల మీదగానే జరుగుతున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

 

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం మొన్న గెలిచిన ఎంఎల్ఏల్లో కనీసం 10 మంది ఎంఎల్ఏలను, ఒక ఎంపిని పార్టీలోకి లాక్కునేందుకు స్కెచ్ మొదలైందట. టిడిపికి మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా 23 మంది ఎంఎల్ఏలు, 3 ఎంపిలు గెలిచిన సంగతి తెలిసిందే.  వీరిలో 7 నుండి 10 మంది ఎంఎల్ఏలను లాగేసుకోవటమంటే మామూలు విషయం కాదు. అదే గనుక నిజంగా జరిగితే టిడిపికి ప్రతిపక్ష హోదా కోల్పోవటం ఖాయం.

 

2014 ఎన్నికల్లో వైసిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు, ఎంపిలను టిడిపిలోకి చంద్రబాబు లాక్కున్న విషయం అందరికి తెలిసిందే. అదే ఫిరాయింపులను ఇపుడు చంద్రబాబు మెడకు చుట్టుబోతున్నారు. అప్పట్లో వైసిపికి చంద్రబాబు ఏం చేశారో తొందరలో  బిజెపి చంద్రబాబుకు అదే చేయబోతోందట.

 

మోడి గురించి వివిధ రాష్ట్రాల్లో పర్యటించటం ద్వారా చంద్రబాబు అడ్డదిడ్డంగా మాట్లాడారు. దానికి ఇపుడు బిజెపి బదులు తీర్చుకోవాలని నిర్ణయించింది. ఇపుడున్న పరిస్దితుల్లో అయితే బిజెపి ఎప్పటికీ రాష్ట్రంలో ఎదిగే అవకాశం లేదు. కాబట్టి టిడిపి ప్రజాప్రతినిధులను, సీనియర్ నేతలను లాక్కోవటం ద్వారా వచ్చే ఎన్నికల్లోగా ఎంతో కొంత బలపడాలన్నది కమలనాధుల ఆలోచన.

 

బిజెపి ప్లాన్ వర్కవుటైతే అనంతపురం జిల్లా నుండి జేసి బ్రదర్స్, వరదాపురం సూరి, పరిటాల సునీత తదితరులు టిడిపిని వదిలేస్తారట. అలాగే కర్నూలులో టిజి వెంకటేష్, వీరభద్రం గౌడ్, భూమా కుటుంబం, మీనాక్షినాయుడు వచ్చేస్తారట. గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి కూడా గట్టి నేతలే బిజెపిలో చేరేందుకు అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేకపోవటం, టిడిపికి భవిష్యత్తు లేదని నిర్ణయించుకోవటంతోనే నేతలు బిజెపివైపు చూస్తున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: