*భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకున్న పోలీసులు*
 నిత్యం ఆధ్యాత్మిక వాతావరణంతో అలరారే అన్నవరంలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. హత్యో, ఆత్మహత్యో తెలియని పరిస్థితుల్లో ముగ్గురి జీవితాలు కడతేరిపోయాయి. తమకు ఏమాత్రం సంబంధంలేని అంశాలకు ముక్కుపచ్చలారని ఇద్దరు పసివాళ్ళు విగతజీవులుగా మిగిలారు. తొందరపాటుతో చోటుచేసుకున్న ఘటనా లేక పధకం ప్రకారం జరిగిన సంఘటనా అనే విషయమై పోలీసులు బాధ్యులపై కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.... 


     గ్రామంలోని జూనియర్ కళాశాల వెనుక మృతురాలు తాళపురెడ్డి సుష్మ రాజ్యలక్ష్మి (25) తన భర్త తాళపురెడ్డి వెంకటరమణ (రమేష్-34), అత్త, మామలతో కలిసి ఉంటుంది. వీరికి సాత్విక్ (4), యువన్ (9నెలలు) అనే ఇద్దరు మగపిల్లలు. మృతురాలి భర్త చెబుతున్న ప్రకారం తాను సెల్ ఫోన్ల షాపు నడుపుతూ సోమవారం ఉదయం 9 గంటలకు షాపుకు వెళ్లిపోయానని, గం.9.30 లకు తమ తల్లిదండ్రులు హాస్పటల్ కు వెళ్లారని, వారు తిరిగి 10 గంటలకు వచ్చేసరికి పిల్లలిద్దర్నీ చంపి తన భార్య ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నాడు.

అయితే మృతురాలి తల్లిదండ్రులు ఇది ఆత్మహత్య కాదనీ, కశ్చితంగా హత్యేనని, ఒక పథకం ప్రకారం భర్త, అత్తమామలు పిల్లలిద్దరితో సహా తమ కుమార్తెను హత్యచేశారని ఆరోపిస్తున్నారు. 2013 లో తమ కుమార్తెకు వివాహం చేసినప్పటి నుంచీ అదనపు కట్నం కోసం పలు వేధింపులకు గురిచేస్తున్నారని, ఇటీవల తమ సొంతూరు విశాఖజిల్లా నాతవరం మండలం ఏ పి పురంలో గ్రామదేవత జాతరకు వచ్చినప్పుడు కూడా అత్తవారింట్లో బాధలు భరించలేక తాను కాపురానికి వెళ్లనని తమ కూతురు అంటే తామే నచ్చజెప్పి ఈ నెల 6న అన్నవరం పంపామని చెబుతున్నారు.

భర్త, అత్తమామలు కలిసి తమ కూతురునీ, ఇద్దరు మనుమలను హత్య చేశారంటూ వారు భోరున విలపిస్తున్నారు. కాగా సంఘటన విషయం తెలిసిన వెంటనే పెద్దాపురం డి.ఎస్.పి సీహెచ్. వి. రామారావు ఆధ్వర్యంలో జగ్గంపేట సీ.ఐ వై. రాంబాబు, అన్నవరం ఎస్.ఐ రావూరి మురళీమోహన్, అడిషినల్ ఎస్.ఐ తమ్మినాయుడు తమ బృందంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా డి.ఎస్.పి రామారావు విలేఖర్లతో మాట్లాడుతూ మృతురాలి తండ్రి కొరుప్రోలు పెద్ద రాజబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకుని హత్య, వరకట్న వేధింపుల క్రింద కేసులు నమోదుచేశామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: