కర్నాటకం ఎలా మొదలైందో కానీ దాని లక్ష్యం, లక్షణం వేరుగా ఉందని రాజకీయ పండితులు క్లారిటీగా చెప్పేస్తున్నారు. కుమారస్వామి కుర్చీని లాగడం అన్నది ఇపుడున్న పరిస్థితుల్లో ఏమంత కష్టం కాదు. అయితే ఆ డ్రామాను ఎలా పండించాలన్నదే కమలనాధుల ఎత్తుగడలను తెలియచేస్తోంది. చేతికి మట్టి అంటకుండా కర్నాటకాన్ని విజయవంతంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. 


అయితే ఆ సంగతి తెలిసిన కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఇపుడు బిర్ర బిగిసాయి. మీరు ఏమైనా చేసుకోండి, మేము సీటు దిగమని కుమారస్వామి చెప్పేస్తున్నారు. రాష్ట్రపతి పాలన వంటిది పెడితే లాభమని ఆ పార్టీలు ఆలోచిస్తున్నాయి. మరి కర్నాటకలో ఎట్నుంచి ఎటు నరుక్కురావాలన్నది ఇపుడు బీజేపీ వ్యూహకర్తల బుర్రలను హీటెక్కించేస్తోంది. దూకుడు నిర్ణయాలను  కూడా ఈ టైంలో కాదనలేని పరిస్థితి ఉంది. అదే జరిగితే కుర్చీ దక్కినా పరువు పోతుందేమోనన్న కలవరమూ బీజేపీలో ఉంది.


ఏది ఏమైనా సీఎం కుర్చీలో కమలం పార్టీ కూర్చుంటే  మిగతా కధ చాలానే ఉందంటున్నారు. సౌత్ కి గేట్ వే గా కర్నాటకను చేసుకున్న బీజేపీ అక్కడ జెండా పాతేస్తే ఇక పొరుగున ఉన్న తమిళనాడు, కేరళ, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలకు ఇది  పెద్ద కుదుపు గానే భావించాలి. తరువాత స్టెప్ ఎవరి నెత్తి మీద పడుతుందో వూహించడమూ కష్టమే. కన్నడ నాట సీన్ రివర్స్ కావాలని మిగిలిన రాష్ట్రాల ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు గట్టిగా కోరుకుంటున్నా కన్నడ నాట మాత్రం అంతా బీజేపీకి అనుకూలంగానే ఉంది మరి. అదే జరిగితే మిగిలిన చోట్ల కూడా కమలంతో సమరం తప్పదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: