ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో కెసియార్ కు గవర్నర్ తమిళిసై పెద్ద షాకే ఇచ్చారు. సమ్మె తీవ్రతను తెలుసుకునేందుకు గవర్నర్ నేరుగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కే ఫోన్ చేసి మాట్లాడారు. అసలైతే సమ్మె వివరాలు తెలుసుకునేందుకు తన వద్దకు రమ్మని గవర్నర్ మంత్రిని ఆదేశించారట.

 

అయితే గవర్నర్ రమ్మన్న సమయానికే కెసియార్ కూడా రమ్మని మంత్రికి అంతకుముందే కబురు చేశారట. తనను కెసియార్ రమ్మన్న విషయాన్ని మంత్రి గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. తాను వ్యక్తిగతంగా రాలేకపోతున్న విషయాన్ని వివరిస్తునే రవాణాశాఖ కమీషనర్ ను పంపుతానని చెప్పారట. దాంతో కమీషనర్ నేరుగా గవర్నర్ ను కలిసి సమ్మె ప్రభావంపై వివరాలు అందించారట.

 

పువ్వాడతో గవర్నర్ ఫోన్లో మాట్లాడినపుడే సెల్ఫ్ డిస్మిస్ అనే విధానంపై నిలదీశారట. గవర్నర్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పలేకపోయారని సమాచారం. 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులపై ఒకేసారి వేటు ఎలా వేస్తారన్న ప్రశ్నకు కూడా మంత్రి సమాధానం చెప్పలేకపోయారట.

 

సరే తర్వాత గవర్నర్ తనతో మాట్లాడిన విషయాన్ని మంత్రి కెసియార్ దగ్గరకు వెళ్ళినపుడు చెప్పారట. దాంతో కెసియార్ అసహనం వ్యక్తం చేశారట. ఇక్కడ విషయం ఏమిటంటే పరిపాలనలో గవర్నర్ నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోరు. ఏదన్నా అవసరమైతే నేరుగా సిఎంతోనే చర్చించటం రివాజు. మంత్రులు, ఉన్నతాధికారులతో గవర్నర్ మాట్లాడకూడదన్న నిబంధనేది లేకపోయినా అలా మాట్లాడటం మాత్రం చాలా అరుదనే  చెప్పాలి.

 

మొన్నటి వరకూ గవర్నర్ గా ఉన్న నరసింహన్ కు కెసియార్ ఎంత చెబితే అంత. అందుకే నరసింహన్ ను మార్చేసిన కేంద్రప్రభుత్వం తమిళిసైని నియమించింది. ఈమె పక్కా బిజెపి నేత. తమిళిసైని నియమించినపుడే కెసియార్ కు చెక్ పెట్టటానికే నియమించారనే ప్రచారం జరిగింది. అది నిజమేనా అన్నట్లగా ఇపుడు గవర్నర్ నేరుగా మంత్రి, కమీషనర్ ను పిలిపించుకుని మాట్లాడటంతో రాజకీయం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ యాక్టివ్ అయ్యిందంటే కేంద్రం జోక్యం మొదలైనట్లే అనుకోవాలి.  మరి కెసియార్ ఏమి చేస్తారో చూడాల్సిందే

 


మరింత సమాచారం తెలుసుకోండి: