రాష్ట్రంలో తమ పునాదిని బలోపేతం చేసుకోవడానికి తెలుగుదేశం పార్టీ, వైకాపాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రతిపక్షమైన వైకాపా కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో పార్టీని సంఘటితపర్చడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకేష్ నడుం బిగించారు. అదే సమయంలో.. పార్టీ కాస్త బలహీనంగా ఉన్న కోస్తా ప్రాంతంలో లోపాలను చక్కదిద్దడానికి జగన్ కూడా శ్రధ్ధ కేంద్రీకరిస్తున్నారు. మొత్తానికి రాష్ట్రంలో రెండు అగ్ర పార్టీలను కీలకంగా నడిపిస్తున్న నాయకులు ఇద్దరూ తమతమ పార్టీల బలహీనతలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వాటిని చక్కదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుండడమే విశేషం. 


రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పార్టీ యూనిట్లను ఇన్ చార్జీలను నియమించిన లోకేష్ మంగళవారం పార్టీ ఉపాధ్యాయ విభాగం సభ్యులతో సమావేశం  నిర్వహించారు. అలాగే ఆయన పార్టీ బలోపేతానికి సుదీర్ఘ వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నారు. అన్ని రంగాలకు  సంబంధించి పార్టీ అనుబంధ కమిటీలను ఏర్పాటు చేస్తే ఆయా విభాగాల్లోకి బాగా చొచ్చుకుపోవచ్చునని పార్టీకి ఎక్కువ లాభం ఉంటుందని కూడా లోకేష్ దిశా నిర్దేశం చేస్తున్నారు. 


ఇదిలా ఉండగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోస్తా జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో వైకాపా పార్టీ ఘోరంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కోస్తా జిల్లాలు కాంగ్రెస్‌కు పెట్టని కోటలా నిలిచాయి. అదే జగన్ పార్టీ పెట్టేసరికి వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటి ఒకప్పటి కంచుకోటలను మళ్లీ తన కైవశం చేసుకునే తలంపుతో జగన్మోహన్ రెడ్డి మంగళవారం తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. క్షేత్ర స్తాయిలో పార్టీని సంఘటితం చేసి కోస్తాజిల్లాల్లో మరిన్ని స్థానాలు కైవసం చేసుకునేందుకు చేపట్టవలసిన చర్యల గురించి ఆయన నేతలతో చర్చించారు. 2019లో జరుగనున్న మరో సంకుల సమరానికి రాష్ట్రంలో రంగం ఇప్పట్నుంచే సిద్దమవుతున్నట్లుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: