రాజకీయ పార్టీ పెట్టడం అంటే ఒక పుస్తకం కొని షెల్ఫులో పెట్టుకోవడం కాదు. పార్టీ అంటూ పెట్టే ప్రతి వ్యక్తి కూడా అది షెల్ఫులోనో, ఉట్టిమీదనో, అటకమీదనో ఉండాలని కాకుండా ప్రజల్లో ఉండాలని, విస్తరించాలని కోరుకుంటాడు. కానీ పవన్‌ కల్యాణ్‌ తీరు కాస్త విచిత్రంగా ఉంది. ఆయన సుమారు రెండు సంవత్సరాల ముందు తన జనసేన పార్టీని స్థాపించారు. ఆయనకు ప్రజల్లో ఉన్న క్రేజ్‌ను, ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. అప్పటికప్పుడే ఎన్నికల బరిలో తొడకొడతాడేమోనని అంతా ఆశించారు. తీరా రెండేళ్లలో పార్టీకి ఈసీ గుర్తింపు కూడా వచ్చిన తరువాత కూడా.. పార్టీని విస్తరించడానికి నా వద్ద డబ్బుల్లేవు.. 2019 ఎన్నికల నాటికి పార్టీని సిద్ధం చేస్తా అంటూ పవన్‌ కల్యాణ్‌ బీద డైలాగులు వల్లిస్తున్నారు. 


ప్రస్తుతం డబ్బుల్లేని పవన్‌కల్యాణ్‌ 2019 నాటికి మాత్రం పార్టీని ఎలా సిద్ధం చేస్తారు? అనేది అందరిలోనూ ఉన్న మీమాంస. ఆయన వైఖరి గమనిస్తే.. పార్టీని విస్తరించడానికి ప్రజలనుంచి లేదా పార్టీతో అనుబంధం కలిగి ఉండడానికి ఇష్టపడే వారినుంచి చందాలు పోగేయడానికి పవన్‌ కల్యాణ్‌ ఒక నిశ్చయానికి వచ్చేసినట్లే కనిపిస్తోంది. 


నిజానికి రాజకీయ పార్టీని నిర్వహించడం అనేది ఎవ్వరూ తమ సొంత డబ్బులతో.. సొంత ఆస్తులతో నిర్వహించే వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే.. రాజకీయ పార్టీ అనేదే.. వారి సొంత ఆస్తిలాంటి వ్యవహారమే కాదు గనుక. అందరూ కలసి మాత్రమే పార్టీని ఒక ప్రజల ఆస్తిగానే నిర్వహించాలి. పార్టీ నిర్వహణలో ప్రజల విరాళాలు ఖచ్చితంగా ఉంటాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఏలుబడిలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ దీనికి ఉదాహరణ. ఆయన ఇప్పటికీ ప్రతి ఎన్నికలకూ ప్రజలనుంచి విరాళాలు తీసుకుంటారు. ఆ సొమ్మును అభ్యర్థుల ఎన్నికల ఖర్చుకు ఇస్తాడు. ఓట్లు అడిగి రాజకీయాల్లోకి వస్తాడు. అయితే కేజ్రీవాల్‌ పార్టీ పేరుతో సొమ్ములు తినేశాడంటూ ఒక్క విమర్శ కూడా ఇప్పటిదాకా మన చెవిన పడలేదు. 


అయితే మన నేపథ్యంలో పరిస్థితులు వేరు. పార్టీకి విరాళాలు మామూలే కాగా, టిక్కెట్‌ లు ఇస్తాం అంటూ కోట్లలో దండేయడం అనేది మన వద్ద రివాజుగా మారింది. ప్రస్తుతం డబ్బుల్లేవంటున్న పవన్‌కల్యాణ్‌ కు స్వయానా అన్నయ్య అయిన చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు.. ఇలా కోట్లాది రూపాయలు సంపాదించేశారని ఆరోపణలున్నాయి. అయితే పవన్‌ అన్నయ్యలా చేయకుండా ఉంటే మంచిది. 


త్వరలో హైద్రాబాద్‌లో రానున్న గ్రేటర్‌ఎన్నికల్లో రంగంలోకి దిగుతారా అంటే డబ్బుల్లేవంటున్న పవన్‌కల్యాణ్‌, 2019 ఎన్నికలకు డబ్బు ఎక్కడనుంచి పోగేస్తారు. అంటే పార్టీ పేరుతో చందాలకు ఆయన కూడా సిద్ధమే అనే తెలుస్తోంది. తన జేబులోంచి పైసా చెల్లించకుండా.. ఎవరి డబ్బు వృథా అవుతున్నదో ఆరా తీయకుండా.. ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లి వచ్చిన వ్యక్తి, పార్టీకోసం చందాలు పోగేయడం తప్పు కాదు. కాకపోతే.. వచ్చిన చందాలకు పారదర్శకత పాటించి, మంచి పేరు నిలబెట్టుకుంటే సరిపోతుంది. ఆ పని చేయడానికి 2019 దాకా ఆగక్కర్లేదు కదా.. గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా చేయవచ్చు. ఏమంటారు పవన్‌జీ!!


మరింత సమాచారం తెలుసుకోండి: