శాంతి భద్రతల పరంగా సందేహాలు, భయాలు చాలానే ఉన్నప్పటికీ వరంగల్‌ ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా ముగిశాయి. చెదురుమదురు సంఘటనలు మినహా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకపోవడం విశేషం. ఒకటిరెండు చోట్ల ఈవీఎం మిషిన్లు మొరాయించగా.. అధికారులు సత్వరమే వాటిని చక్కదిద్దారు. అలాగే ఒక బూత్‌ పరిధిలో ప్రజల ఎన్నికలను బహిష్కరించారు. ఇలాంటి ఘటనలు తప్ప పోలీసులు ముందు ఆందోళన వ్యక్తం చేసినట్లుగా ఎలాంటి దుర్ఘటనలు దాడులు ప్రతికూలతలు నిరసనలు వెల్లడి కాలేదు. చివరికి మావోయిస్టులు చెరపట్టిన తెరాస నాయకులను కూడా విడుదల చేసేయడంరతో సమస్తం ప్రశాంతంగానే ముగిసినట్లయింది. 


మావోయిస్టుల ప్రాబల్యం నేపథ్యంలో ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు ఉండవచ్చునని పోలీసులు అనుమానించారు. పైగా ఇటీవలేజరిగిన ఎన్‌కౌంటర్లు కూడా వారిని రెచ్చగొట్టవచ్చునని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతా సజావుగా ముగిసిపోయింది. ఈసారి భిన్నంగా తొలి ఓటరును అధికారులు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చి సన్మానించారు. అలాగే ఈవీఎంల మీద అభ్యర్థులు ఫోటోలు కూడా వారి పేర్లు గుర్తుల పక్కనే ఉంచడం, అలాగే హిజ్రాలకు కూడా ఓటు హక్కు కల్పించడం వంటి ప్రత్యేకతలు ఈ ఎన్నికకు ఉన్న సంగతి తెలిసిందే. 


ఎక్కడా రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం కూడా రాకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నందుకు ఎన్నికల యంత్రాంగానికి అభినందనలు దక్కుతున్నాయి. పోలీసులు మాత్రమే కాదు.. ఎన్నికల సంఘానికి చెందిన, వారి తరఫున బాధ్యతలు చూసిన ఇతర శాఖల అధికారులు అందరూ కూడా సమన్వయంతో వ్యవహరించి పక్కాగా చేసినందునే ఎన్నికలు ఇంత సజావుగా ముగిశాయని జనం అంటున్నారు. ఉదయం ఓటింగ్‌ ప్రారంభం అయ్యే సమయానికే ఓటర్లు పెద్ద సంఖ్యలో బూత్‌ల వద్దకు చేరుకున్నారు. మధ్యాహ్నానికే చాలా ఓట్లు పోలైపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: