ఢిల్లీ మరియు హైదరాబాదు రాజకీయాలను ఒక విడత సవరించి వచ్చిన తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు విజయవాడలో తన ప్రభుత్వంలోని మంత్రులతో కీలకమైన వ్యూహకమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. అయితే ప్రభుత్వం తరఫున కసరత్తు జరుగుతున్న ఈ వ్యూహకమిటీ సమావేశానికి ప్రధాన ఎజెండా ప్రజా సంక్షేమం అనే దానికంటె.. ప్రతిపక్షాలను తిప్పికొట్టడం, శత్రుశేషం లేకుండా నిర్మూలించడం అనే అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్సయిట్‌ తవ్వకాలు, కల్తీ మద్యం ఘటన, అమరావతి నిర్మాణం అనేవి ప్రస్తుతానికి అజెండా అంశాలుగా ఉన్నాయి. అయితే వీటిలో తొలి రెండింటి గురించే వ్యూహాలు సిద్ధం చేయడానికి వారు సిద్ధమవుతున్నారు. 


పరిపాలనలో చంద్రబాబునాయుడు సర్కారు అనుసరిస్తున్న ఇష్టానుసారమైన పోకడలకు ఇటీవలి కాలంలో ప్రజావ్యతిరేకత బాగానే వ్యక్తమవుతోంది. ప్రజల్లో స్వచ్ఛందంగా పుడుతున్న వ్యతిరేకతను ప్రతిపక్షాలు అందిపుచ్చుకుంటున్నాయి. వైఎస్‌ జగన్మోహనరెడ్డి, నిజానికి బాక్సయిట్‌కు అనుమతులు ఇచ్చింది తన తండ్రి హయాంలోనే అయినప్పటికీ.. అప్పట్లో పనులు మొదలు కాకపోవడాన్ని తమ చిత్తశుద్ధి కింద చాటుకుంటూ.. ప్రస్తుతం తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాన్ని ఎండగట్టేలా.. గిరిజనులతో కలిసి ఉద్యమిస్తున్నారు. కాబట్టి జగన్‌ నోటికి తాళం వేసేలా తామేంచేయాలా బాక్సయిట్‌ పాపాన్ని మొత్తం జగన్‌ నెత్తికే పులిమేసేలా ఎలాంటి వ్యూహాలు పాటించాలో ఆలోచించడానికి ఈ వ్యూహకమిటీ సమావేశం తొలి ప్రాధాన్యం ఇస్తోంది. 


అలాగే కాంగ్రెస్‌ను భ్రష్టు పట్టించడానికి వారికి మల్లాది విష్ణు బార్‌లో కల్తీమద్యం కేసు బాగా అంది వచ్చింది. పైగా మద్యం బ్రాండ్‌లలో కల్తీ కాకుండా, ఈ బార్‌లోనే కల్తీ జరిగినట్లు కూడా తేలిపోయింది. ఈ నేపథ్యంలో మల్లాది విష్ణు ఒక్కడికే పరిమితం అవుతున్న ఈ కేసులోని అపకీర్తిని మొత్తం కాంగ్రెసు పార్టీకి ఎలా పులిమివేయాలి.. అనే విషయంలో కూడా తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం పెద్దలు వ్యూహాలు సిద్ధం చేయనున్నారు. 


ఒకవైపు తెలంగాణలో తెలుగుదేశానికి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. మరోవైపు ఏపీలో చంద్రబాబునాయుడు తాను కూడా శత్రుశేషం లేకుండా చేసుకోవాలనే దిశగానే... ఆలోచిస్తున్నారు. అయితే వారినుంచి వలసలను కోరుకోకుండా, వారి మాటకు ప్రజల్లో విలువలేకుండా చేయాలని పాట్లు పడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: