ఫాంలో ఉండి నిత్యం గడగడ లాడించే వారికే ఇప్పుడు కొన్ని సందర్భాలలో దిక్కు మొక్కు ఉండడం లేదు. న్యాయస్థానం ఎదుట తుస్సు మంటున్నారు. అలాంటిది.. ఫాంలో లేకుండా కొట్టుమిట్టాడుతున్న వ్రుద్ధ సింహాన్ని నమ్ముకుని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంత దూరం పోరాడగలరు. ఎలాంటి విజయం సాధించగలరు? అసలే మాంచి కాక మీద ఉన్న ప్రత్యర్థి, న్యాయపరంగా చట్టాల ఆనుపానులు పుష్కలంగా తెలిసిన ప్రత్యర్థి సంధించిన కేసు నుంచి ఎలా విజయుడై  తిరిగి రాగలరు? రాజీ దిశగా వెళితే తప్ప.. మరో రకంగా కేజ్రీవాల్ గెలవడం అనేది సాధ్యమేనా? అనే తర హా చర్చోపచర్చలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు ఆయన పార్టీకి చెందిన కొందరు కీలక నాయకులపై కేంద్ర ఆర్థిక మంత్రి , స్వయంగా సుప్రసిద్ధ న్యాయవాది అయిన అరుణ్ జైట్లీ పది కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు బెయిల్ ఇచ్చిన పాటియాలా హౌస్ కోర్టులోనే అరుణ్ జైట్లీ ఈ పరువు నష్టం కేసు కూడా వేశారు. దీనిని న్యాయస్థానం విచారణకు కూడా స్వీకరించింద. ఢిల్లీ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడిగా జైట్లీ ఉన్న రోజుల్లో ఆయన అదుపులేని అవినీతికి పాల్పడ్డారని.. ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఈ అవినీతిలో వాటా ఉన్నదని ఆమ్ ఆద్మీ నాయకులు ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యదర్శులకు సంబంధించిన కార్యాలయాల మీద సీబీఐ దాడులు జరిగిన నాటినుంచి అరుణ్ జైట్లీ మీద ఆరోపణలు పెరిగాయి.

అయితే తమాషా ఏంటంటే... అరుణ్ జైట్లీ , కేజ్రీవాల్ మరియు అనుచరుల మీద వేసిన పది కోట్ల రూపాయల పరువు నష్టం కేసులో కేజ్రీ కి దన్నుగా దేశంలోనే సుప్రసిద్ధ లాయర్లలో ఒకరైన రాం జెఠ్మలానీ రంగంలోకి దిగారు. ఈ కేసు 5వ తేదీన విచారణకు రానుంది. ఆయన ఉచితంగానే కేజ్రీ తరఫున వాదించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అరుణ్ జైట్లీ తనకు రాజకీయ ప్రత్యర్థి కూడా కావడంతో.. జెఠ్మలానీ.. కేజ్రీ రూపంలో పగ తీర్చుకోవడానికి రంగంలోకిదిగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ అదేసమయంలో ఇటీవలి కాలంలో జెఠ్మలానీ ఫాంలో లేరనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆయన పలు వివాదాస్పద కేసుల్లో తన పటిమ చూపించినప్పటికీ ఫలితం సాధించిన దాఖలాలు మాత్రం లేవు. ఆ నేపథ్యంలో ఫాంలో లేని జెఠ్మలానీని నమ్ముకుని.. కేజ్రీవాల్ ఎంతవరకు పోరాడగలరో అని సందేహాలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: