నిర్మాణంలో ఉండి నిధుల సమస్యతో పుర్తిచేయలేని ప్రాజెక్టులకు ఆర్ధిక సాయం చేసేందుకు రెండు దశాబ్దాల క్రితం కేంద్రం సత్వర సాగునీటి ప్రయోజన పథకాన్ని(ఏఐబీపీ) అమలులోకి తెచ్చింది. ఈ పథకం కింద పూర్తిచేయ్యడానికి అయ్యే వ్యయంలో... కరువు ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు 90శాతం, ఇతర ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు 30శాతం నిధులు కేంద్రం నుంచి అందేవి. ఏ రాష్ట్రం సాగు నీటి ప్రాజెక్టులకు ఎక్కువ ఖర్చుచేస్తే ఆ రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వచ్చేవి. కేంద్ర జల సంఘం నుంచి సాకేతిక అనుమతి ఉన్న ప్రాజెక్టులకు మాత్రమే ఏఐబీపీ కింద ఎంపిక చేసేవారు. గత సంవత్సరం నుంచి ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానంలో మార్పులుచేసి... ప్రధానమంత్రి సంచిత్ కృషి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఐదేళ్ల లో రూ.50వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించింది. మొదట దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న 23 ప్రాజెక్టులను ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణ లో దేవాదుల, ఆంధ్రప్రదేశ్ లో ముసురుమిల్లి ప్రాజెక్టు ఉన్నాయి.


ఎంపికైన ప్రాజెక్టుల జిల్లాలకు సంబంధించి సమగ్ర నీటి వినియోగంపై కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని, ఈ ప్రణాళిక రుపొందించకపోతే వచ్చే ఏడాది నుంచి నిధులు ఇవ్వబోమని కూడా కేంద్రం తేల్చి చెప్పింది. అయితే ఏఐబీపీ కింద ఎక్కువ ప్రాజెక్టులు అందేవి. ఈ పథకం కింద ఎంపిక చేసిన కొన్ని ప్రాజెక్టులు పూర్తైన తర్వాత కొత్త ప్రాజెక్టులను ప్రతిపాధించేవారు. ప్రస్తుతం ఈ అవకాశం లేకుండా పోయింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విధానం రాష్ట్రాలకు నష్టమనే అభిప్రాయం ఎక్కువ రాష్ట్రాల నుంచి వ్యక్తమౌతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22,23 తేదీల్లో ఢిల్లీ లో జరిగే ‘జలమంథన్’ సదస్సులో ఏఐబీపీ అంశాన్ని లేవనెత్తాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల మంత్రులు నిర్ణయించుకొన్నట్లు సమాచారం.


ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది రూ.116 కోట్లు మాత్రమేనని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ ధీ ఇదే పరిస్థితి. రాష్ట్ర అవసరాలను పరిగణలోకి తీసుకొని ఏఐబీపీ కింద వచ్చే బడ్జెట్ లో రూ. 20వేల కోట్లు కేటాయించాలని కర్నాటక కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిసింది.  కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జలమంథన్ సదస్సులో నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా జలవనరుల సుస్థిర అభివృద్ధి, భుగార్భజల అభివృద్ధి, భూగర్భ జల వినియోగానికి సంబంధించిన బిల్లు, ప్రాజెక్టుల కింద సాగులోకి రావాల్సిన ఆయకట్టు, సాగవుతున్న ఆయకట్టు, నీటి కేటాయింపుల్లో ప్రాధాన్యతలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం, నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం, నీటి వినియోగంలో మెరుగైన పద్ధతులు, సంరక్షణ పై చర్చలు జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయపై కూడా చర్చ జరగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: