తెలంగాణపై నెలరోజుల్లోనే నిర్ణయం తీసుకుంటామంటూ కేంద్ర హోంమంత్రి షిండే శుక్రవారం చేసిన ప్రకటనను ఆయన శాఖ అధికారికంగా ద్రువీకరించింది. ఇదే విషయాన్ని మంత్రి షిండే పత్రికా సమావేశంలో చెప్పారని హోం శాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ద్వారా శనివారం సవరణ ప్రకటన జారీ చేసింది. వాస్తవానికి, కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్ష భేటీలో కొందరు ప్రతినిధులు అభిప్రాయపడ్డారని, మరికొందరు నెల రోజుల కాల వ్యవధిని సూచించారని సమావేశం ముగిసిన తర్వాత రా హోం శాఖ శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి షిండే విలేకరులతో చెప్పారు. కానీ, ఆ శాఖ అధికారిక ప్రకటనలో ఆ విషయాన్ని ప్రస్తావించకపోవడంతో కొన్ని వర్గాల్లో అనుమానాలు రేకెత్తాయి. దీంతో కలవరపాటుకు గురయ్యిన కొందరు కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు ఈ విషయాన్ని హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో, లోపాన్ని సవరించి, అనుమానాలు నివృత్తి అయ్యేలా చూడాలని షిండే సూచించటంతో హోం శాఖ ఉన్నతాధికారులు శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనకు సవరణ చేసి శనివారం సాయంత్రం మళ్లీ విడుదల చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: