తెలంగాణా - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల మధ్యన కృష్ణా జలాల పంపిణీ కొత్త తలనొప్పులు తెస్తున్న తరుణం లో తెలంగాణా సర్కారు ఏపీ ప్రభుత్వానికి హుకుం జారీ చేసింది. సహాయ పునరావాస పనులు అన్నీ పూర్తి అయ్యి జనం అంతా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిన తరవాతనే పులిచింతల ప్రాజెక్ట్ ని పూర్తి సామర్ధ్యం తో నింపడానికి అనుమతి ఇస్తాం అని తెలంగాణా సర్కారు ఏపీ కి లంకె పెట్టింది. ఈ విషయం మీద ప్రత్యేక లేఖ ని ఏపీ సర్కారు కి పంపింది తెలంగాణా సర్కారు.

 

 కృష్ణా జలాల పంపిణీ, కృష్ణా బోర్డు పరిథి లో ఉండే వివిధ విషయాల గురించి మాట్లాడిన తెలంగాణా సర్కారు తెరపైకి పులిచింతల వివాదం తీసుకొచ్చి ఏపీ కి చెక్ పెట్టింది. పులిచింతల ప్రాజెక్ట్ కింద 13 గ్రామాలు ఇప్పటికే ముంపుకు గురి అవుతున్నాయి. నల్లగొండ లోని  అడ్లూరు,వెల్లటూరు, కిష్టాపురం, చింత్రియాల, నెమలిపురి, రేబల్లె, శోభనాద్రిపురం, సుల్తానపూర్‌తండా, మట్టపల్లి, గుండ్లపల్లి, గుండెబోయినగూడెం, తమ్మవరం, పీక్లానాయక్‌ తండా తో పాటు ఇంకా చాలా గ్రామాలు ఈ ప్రాజెక్ట్ కింద ముంపులో పడి ఉన్నాయి. పునరావాసం పూర్తి అవ్వకుండా ముంపు గ్రామాల సంగతి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు అని ఏపీ కి చెప్తోంది తెలంగాణా సర్కారు.

 

పునరావాస పనులు పూర్తి అవ్వడం కోసం వంద కోట్ల పైన నిధులు కావాలి అంటూ గతేడాది తెలంగాణా ప్రభుత్వం లేఖ కూడా రాసింది, దానికి ఏపీ ఇప్పటివరకూ స్పందించలేదు. ఇప్పటికే ముంపు కి గురైన నల్లగొండ ప్రజల సహాయ , పునరావాసం కోసం ఏపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో పునరావాస కార్యక్రమాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సో ఈ లెక్కలో సహాయ పునరావాసం పూర్తి అయ్యే దాకా ప్రాజేక్ట్ లో పూర్తి నీరు నింపే సమస్యే లేదు అని తెలంగాణా సర్కారు తేల్చి చెప్పింది.


మరింత సమాచారం తెలుసుకోండి: