ప్రతీసారి ఎన్నికలప్పుడు మాత్రమే వినిపించే మాట తృతీయ కూటమి.. అయితే ఈసారి కొంత ముందుగానే ఈ పదం వాడకంలోకి వచ్చింది. కేంద్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితే ఈ ప్రతిపాదనకు మళ్లి బలం ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు ఈ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షాలు. అయితే ఇప్పటికిప్పుడే ఇవన్నీ ఇందులో ఉంటాయా. ఆ మాటకొస్తే ఈ ఫ్రంట్‌ కూడా ఎన్నికల వరకు గానీ ఆ తర్వాత గానీ ఉంటుందని చెప్పలేని పరిస్థితి. యూపీఏ, ఎన్డీయేలను కాదని, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ నేత ములాయంసింగ్‌ యాదవ్‌ దృష్టి థర్డ్‌ ఫ్రంట్‌పై పడింది. ప్రధాని రేసులో ఉన్నానన్న ఆయన సమస్యల పరిష్కారంలో యూపీఏ, ఎన్డీయేలు విఫలమయ్యాయని గొంతెత్తారు. వచ్చే ఎన్నికల్లో యూపీఏగానీ, ఎన్డీయే కానీ సర్కారును ఏర్పాటు చేయలేవని జోస్యం చెప్పారు. అంతేకాదు సమాజ్‌వాదీ పార్టీ మద్దతు లేనిదే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరని తేల్చి చెప్పారు.  ప్రస్తుతం కేంద్రంలో మధ్యంతర ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ రానురానూ బలహీనం అవుతోందని గుర్తించిన సమాజ్‌ వాదీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఇప్పటికిప్పుడే మధ్యంతరం వస్తే బాగుండని కోరుకుంటున్నాయి. పైగా ఈ రెండు ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి కాబట్టి ఇంకా కాలం గడిస్తే ప్రభుత్వ వ్యతిరేకత పనిచేసే ప్రమాదముందని భయపడుతున్నాయి. మరోవైపు మొదట్నుంచీ ఈ కూటమిలో కీలక భాగస్వామి అయిన తెలుగుదేశం మాత్రం ఎన్నికలకు దూరం అంటోంది. కేంద్రంలో థర్డ్‌ ఫ్రంట్‌ సాధ్యమేనా. ఏర్పడితే అందులో ఏయే పార్టీలుంటాయి. ఉన్న పార్టీలైనా ఎంత కాలం కలిసుంటాయి. ఒకపార్టీ మాటను ఇంకో పార్టీ ఎంతకాలం గౌరవిస్తుంది.తృతీయ కూటమిపై ముసురుకుంటున్న సందేహాలివి.

మరింత సమాచారం తెలుసుకోండి: