నూత‌న రాష్ట్రం ఏర్పడ్డ ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన ప్ర‌త్యేక హోదా ను బీజేపీ స‌ర్కార్ దాదాపుగా తుంగ‌లో తొక్కిన‌ట్టే. అంతేకాదు... గ‌త కొంత కాలంగా ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తామ‌ని చెప్పిన కేంద్రం ప్యాకేజీ పైన కూడా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. కాక‌పోతే... ప్ర‌త్యేక నిధుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌క‌టించారు. ఇక... ఇప్పుడు ప్ర‌త్యేక హోదా అనేదే ఉనికి లో లేకుండా పోయింది. నవ్యాంధ్ర‌కు అది ఇచ్చేదెలా? ఇప్పుడు కేంద్ర ముందున్న ప్ర‌శ్న‌! ఆంద్ర‌ప్ర‌దేశ్ కు కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయం పేరిట విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో... ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేక‌పోవ‌డానికి కార‌ణాలు వివ‌రించారు అరుణ్ జైట్లీ. ఐదేళ్ల పాటు 2019-2020 వ‌ర‌కు కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలో 14వ ఆర్థిక సంఘం నిర్వ‌హించింది.

ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణాలివే...

ప్రత్యేక హోదా రాష్ట్రాలు, సాధారణ రాష్ట్రాల మధ్య ఆర్థిక సంఘం ఎలాంటి తేడాను గుర్తించలేదు. రాష్ట్రాల ఆర్థిక అవసరాలను కేంద్ర పన్నుల్లో వాటా ద్వారా వీలైనంత మేరకు తీర్చాలన్నది 14వ ఆర్థిక సంఘం విధానం. ఈ నేపథ్యంలోనే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా చెల్లించినా ఆదాయ లోటు తీరని రాష్ట్రాలకు ‘రెవెన్యూ లోటు గ్రాంటు’ అందుతోంది. ఇలా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటి. 14వ ఆర్థిక సంఘం కాలంలో ఏపీకి రెవెన్యూ లోటు భర్తీ కోసం సహాయం చేయాలని కమిషన్‌ సిఫారసు చేసింది. ఏ సంవత్సరం ఎంత లోటు ఉంటుందో కూడా తెలిపింది. దీని ప్రకారం ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు భర్తీకి 22,113 కోట్లు చెల్లించాల్సి ఉంది.
 
మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ హోదా ప్ర‌క‌ట‌న‌...

మాజీ ప్ర‌ధాని, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 2014 ఫిబ్రవరి 20వ తేదీన ప్రధాని హోదాలో రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఇందులో ఆరు అంశాలు ఉన్నాయి. వీటిలో ఐదు అంశాలపై ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రత్యేక హోదా అంశంపై మాత్రమే కొంత భిన్నమైన పరిస్థితి ఉంది. మన్మోహన్‌ ప్రకటన తర్వాత వచ్చిన 14వ ఆర్థిక సంఘం సిఫారసులే ఈ పరిస్థితికి కారణం. తన నివేదికలో 17వ పేజీలో ప్రత్యేక హోదా గురించి కమిషన్‌ ఏం చెప్పిందంటే.... ‘‘ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా లేని రాష్ట్రాల మధ్య మేం ఎలాంటి తేడా గుర్తించడం లేదు. ప్రతి రాష్ట్రం తమ ఆర్థిక అవసరాలను ఎదుర్కొనేందుకు ఉన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నాం. ఆర్థిక కార్యకలాపాలు తక్కువగా ఉండటం, మారుమూల ప్రాంతాల్లో, అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉండటం వల్ల ఈశాన్య రాష్ట్రాలు, పర్వత ప్రాంత రాష్ట్రాల పరిస్థితి మరింత భిన్నంగా ఉందని గుర్తించాం. 

14 ఆర్థిక సంఘం సిఫార్సుల ప్ర‌కారమే....

ప్రతి రాష్ట్రం యొక్క ఆర్థిక లోటును పన్నుల్లో వాటా చెల్లింపు ద్వారా తీర్చాలన్నదే మా ఉద్దేశం. ఇలా కేవలం పన్నుల్లో వాటా చెల్లించినప్పటికీ లోటు తీరని పక్షంలో... ప్రత్యేకంగా రెవెన్యూ లోటు గ్రాంటు చెల్లించాలి. అలాగే, రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలను సమర్థమైన విధానాల ద్వారా తగ్గించాలి!’’ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల నేపథ్యంలో రాష్ట్రాలకు ‘ప్రత్యేక కేటగిరీ హోదా’ అనేది ముగిసినట్లే!  అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి 2015-16 నుంచి 2019-20 వరకు ఐదేళ్లపాటు వచ్చే అదనపు సహాయం (హోదా ఇచ్చిన పక్షంలో వచ్చే నిధులు) అందించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విదేశీ సహాయంతో అమలు చేసే ప్రాజెక్టుకు నిధులు అందించడం ద్వారా ఈ సహాయం చేస్తామ‌ని జైట్లీ వివ‌రించారు. అంతేకాకుండా ఈ విదేశీ రుణం కేంద్రం ప్ర‌భుత్వ ఏఫ్ఆర్బీఎం ప‌రిధిలోనే  ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. 

13 జిల్లాల సీమాంధ్ర‌కు కేంద్రమే నిధులు ఇవ్వ‌నుంది...

 ‘‘ప్రత్యేక హోదా అనేది సెంటిమెంటుగా మారి ఉండొచ్చు. కానీ... సెంటిమెంటుతో అభివృద్ధి సాధ్యం కాదు. నిధులు, ఆర్థిక వనరులు కావాలి. హోదా అంటే ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే. హోదా వల్ల జరిగే లబ్ధినంతా ఏపీకి చేకూరుస్తున్నాం! ఇక ఇందులో అభ్యంతరం ఏమిటి?’’ అని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు. నవ్యాంధ్రకు ప్రస్తుతం చట్టబద్ధంగా ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదని తెలిపారు. పదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి ఏం చేసిందో, రెండేళ్లలో తామేం చేశామో పోల్చి చూడాలన్నారు. వాస్త‌వానికి గత 27 నెలల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ కు ఇచ్చిన ప్యాకేజీలు, చేసిన స‌హాయం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎవ్వ‌రూ...ఎన్న‌డూ ఏ రాష్ట్రానికి ఇవ్వ‌లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్న‌ప్పుడు... 13 జిల్లాల సీమాంధ్ర కు ఐదేళ్లలో రూ.64 వేల కోట్లు ల‌భించాయి. 

అందుకే ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌లేదు...

మా ప్ర‌భుత్వ హాయాంలో ఐదేళ్ల‌లో ..14 వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద‌, కేంద్ర ప‌న్నుల్లో వాటా కింద న‌వ్యాంధ్ర కు రూ.2.06 ల‌క్ష‌ల కోట్లు వ‌స్తాయి. ఈశాన్య రాష్ట్రాలు, కొండ రాష్ట్రాలు మినహా మిగతా వాటికి ప్రత్యేక హోదా లేదని 14వ ఆర్థిక సంఘం ప్రకటించింది. అది రాజ్యాంగ అవార్డు. అది స్పష్టంగా చెప్పింది. న్యాయ సలహా ఏమంటే... అప్పట్లో ప్రధానమంత్రి ప్రకటన చేశారు. అయినా దాని అమలు సాధ్యం కాదు. ప్రకటన చేసింది మేం కాదని తప్పించుకోవచ్చు! అయితే, హోదాతో మాత్రమే అభివృద్ధి సాధ్యం కాదన్నది వాస్తవం. నిధులు, గ్రాంటుల ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది. హోదా ద్వారా మీకేం వస్తుందో.. దానిని నేను వేరే ప్రక్రియ ద్వారా.. అంటే విదేశీ మద్దతు ప్రాజెక్టుల ద్వారా ఇస్తాను. ఆ మొత్తాలను కేంద్రమే చెల్లిస్తుందని చెబుతూనే... దీనిని దృష్టి లో ఉంచుకునే ప్ర‌త్యేక హోదా ను ఇవ్వ‌లేక‌పోయామే త‌ప్ప మ‌రో ఉద్దేశం కాద‌ని అరుణ్ జైట్లీ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: