2012-13 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థికాభివృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావటం వల్ల అనేక రంగాలపై ఒత్తిడి పడుతోంది. దీనితో రక్షణ రంగానికి కేటాయించిన బడ్జెట్లో 14వేల కోట్ల రూపాయల మేర కోత విధించింది. కొత్త ఆయుధాలను సేకరించటాన్ని వాయిదా వేయటం లేక బడ్జెట్‌ తగ్గించటం వంటి అంశాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకుంది. అనేక సంవత్సరాలుగా బడ్జెట్లో ఇంత మేర కోత విధించిన సందర్భం లేదు.  ఇటీవల ముగిసిన 'ఏరో ఇండియా' ప్రదర్శన అనంతరం రక్షణ మంత్రి అంటోనీ మాట్లాడుతూ మన దేశం ప్రపంచంలో దీవి మాదిరిగా ఉండలేదని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగించినట్లే ఇండియా ఆర్థిక వ్యవస్థ కూడా మందగిస్తుందని పేర్కొన్నారు. పలు శాఖల బడ్జెట్లలో కోత విధించినట్లే రక్షణ శాఖ బడ్జెట్లో కూడా కోత విధించక తప్పదని స్పష్టంచేశారు. అయితే ప్రాధాన్యతా రంగాలలో కోత ఉండదని అన్నారు. రక్షణ శాఖ కొత్త యుద్ధ సామాగ్రిని కొనుగోలు చేయటానికి 10వేల కోట్లు తక్కువగా ఖర్చు పెట్టనున్నది.  తద్వారా ఆయుధాల కొనుగోలు పై ప్రభావం పడినట్లు రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. ఫ్రాన్స్‌ నుండి 17 బిలయన్‌ డాలర్ల వ్యయంతో 200 అత్యాధునిక జెట్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేయటానికి ఇండియా ప్రతిపాదించింది. అయితే ఈ కొనుగోలును వచ్చే ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేశారు. నిధుల కొరత వల్ల ఈ యుద్ధ విమానాలన్నీ ఒకేసారి కాకుండా, దశలవారీగా కొనుగోలు చేయాలని నిర్ణయాన్నిమార్చారు. చైనా సరిహద్దులో వినియోగించటానికి అమెరికా నుంచి కొనుగోలు చేయాల్సిన అతి తేలిక రకం హవిట్జర్‌ యుద్ధ విమానాల కొనుగోలు కూడా వాయిదా పడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి రేటు సంతృప్తికరంగా ఉండి పన్నుల వసూళ్లు పెరిగితేనే రక్షణ బడ్జెట్‌ పెంచటం సాధ్యం అవుతుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: